కవిత ఖాతాలోకి ‘టీఆర్ఎస్’ బ్రాండ్.. అధికారికంగా ఆమోదించిన ఎన్నికల సంఘం!

తెలంగాణ రాజకీయ యవనికపై ఒక సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది.;

Update: 2026-04-30 12:00 GMT

తెలంగాణ రాజకీయ యవనికపై ఒక సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాల పాటు తెలంగాణ సెంటిమెంట్‌కు మారుపేరుగా నిలిచిన ‘టీఆర్ఎస్’ పేరు ఇప్పుడు సరికొత్త రూపంలో కొత్త నాయకత్వంలోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సారథ్యంలో ఉద్యమ కాలం నుండి అధికార పీఠం వరకు వెలిగిన ఈ పేరు, ఇప్పుడు ఆయన కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తగతమైంది.

ముగిసిన సస్పెన్స్... ‘టీఆర్ఎస్’ కవిత సొంతం

గత కొంతకాలంగా కవిత తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆమె కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేశారు. గత వారం ఆమె తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పటికే ‘బీఆర్‌ఎస్’గా ఉన్న గులాబీ పార్టీ నాయకత్వం ఈ పరిణామాలను తేలికగా తీసుకుంది. ‘టీఆర్ఎస్’ అనే పేరును ఇతరులకు కేటాయించడం సాధ్యం కాదని బీఆర్‌ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.

కానీ కేంద్ర ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంటూ కవిత దరఖాస్తును ఆమోదించింది. ఆమె పార్టీని అధికారికంగా ‘తెలంగాణ రక్షణ సమితి’ పేరుతో నమోదు చేస్తూ దానికి సంక్షిప్త నామంగా ‘టీఆర్ఎస్’ను కేటాయించింది. దీనితో తెలంగాణ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన బ్రాండ్ నేమ్ ఇప్పుడు కవిత ఖాతాలోకి చేరింది.

బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బ?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే లక్ష్యంతో కేసీఆర్ తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ నుండి ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మార్చారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పాత పేరు (టీఆర్ఎస్) వైపు వెళ్తే బాగుంటుందని పార్టీలో అంతర్గత చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రజలతో పెనవేసుకుపోయిన ఆ సెంటిమెంట్ పేరును మళ్లీ దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తున్న తరుణంలో కవిత ఆ పేరును రిజిస్టర్ చేయించుకోవడం రాజకీయంగా పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకి పాత పేరును తిరిగి పొందే మార్గం పూర్తిగా మూసుకుపోయింది.

కవిత వ్యూహం ఏమిటి?

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద చీలికకు లేదా కొత్త ప్రత్యామ్నాయానికి సంకేతం అని చెప్పొచ్చు.. ‘టీఆర్ఎస్’ పేరుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తిరుగులేని గుర్తింపు ఉంది. కవిత ఈ పేరును వాడుకోవడం ద్వారా ప్రజల్లోకి సులభంగా వెళ్లవచ్చు. కవిత సొంతంగా పార్టీ పెట్టడం.. అది కూడా పాత పేరుతో రావడం వల్ల బీఆర్‌ఎస్ క్యాడర్‌లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతూనే తన తండ్రి నిర్మించిన వారసత్వ బ్రాండ్‌ను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా కవిత తన స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవాలని చూస్తున్నారు.

తెలంగాణ సిద్ధాంతం, పోరాటం చుట్టూ తిరిగిన ‘టీఆర్ఎస్’ పేరు ఇప్పుడు కల్వకుంట్ల కవిత చేతిలో కొత్త ఆయుధంగా మారింది. "తెలంగాణ రక్షణ సమితి" పేరుతో ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసి, ‘టీఆర్ఎస్’ పేరుతో కొత్త పోరాటం మొదలైందనేది వాస్తవం.

Tags:    

Similar News