ఇకపై 'కల్వకుంట్ల' కవిత కాదా..?

అయితే ఇప్పుడు కవిత తన పుట్టింటి నుంచి వచ్చిన ఇంటి పేరును వదులుకోనున్నారనే ప్రచారం ఓ వర్గం మీడియాలో చక్కర్లు కొడుతోంది.;

Update: 2025-11-14 11:30 GMT

సాధారణంగా భారతీయ సంప్రదాయంలో వివాహం అయిన అనంతరం మహిళలు తమ భర్త ఇంటిపేరును స్వీకరించడం తెలిసిందే. అయితే రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారి కుమార్తెలు వారి పుట్టింటి పేరునే కంటిన్యూ చేస్తుంటారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కవిత తన పుట్టింటి నుంచి వచ్చిన ఇంటి పేరును వదులుకోనున్నారనే ప్రచారం ఓ వర్గం మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అవును... బీఆరెస్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఇంటి పేరును తొలగించుకుని.. ఆమె తన భర్త అనిల్ కుమార్ ఇంటిపేరు 'దేవనపల్లి'గా మార్చుకుని.. ఇకపై తనను తాను దేవనపల్లి కవితగా మార్చుకుంటుందని కథనాలొస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయని అంటున్నారు.

వాస్తవానికి బీఆరెస్స్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కవిత తన తండ్రి ఇంటిపేరును పెట్టుకోవడం ద్వారా ఆమె తిరిగి బీఆరెస్స్ వైపు చూసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే... ఈ విమర్శలను తిప్పికొట్టడానికి ఆమె ఇకపై తన భర్త ఇంటిపేరును పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తద్వారా రీబ్రాండింగ్ దిశగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.

కాగా... గత నెలలో కవిత ఒక కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రజల్లోకి వెళ్తూ నాలుగు నెలలపాటు యాత్ర చేపడుతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ లాంచ్‌ చేసిన అనంతరం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారులు, అమరవీరుల త్యాగాలకు అర్ధం ఉండాలంటే సామాజిక తెలంగాణ రావాలని.. అందుకే యాత్రను చేస్తున్నట్లు తెలిపారు.

అయితే ఈ యాత్రలో తన తండ్రి, బీఆరెస్స్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఫొటో ఉండబోదు అని ఆమె స్పష్టం చేశారు. అయితే... ఇది కేసీఆర్‌ ను అగౌరవపరిచే ఉద్దేశం ఎంతమాత్రం కాదని.. కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ లేదని చెబుతూ... కాకపోతే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనస్తత్వం తనకు లేదని.. ఆ చెట్టు కింద దుర్మార్గులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే "కల్వకుంట్ల" ఇంటిపేరునూ మార్చుకోనున్నారని అంటున్నారు!

Tags:    

Similar News