వైసీపీ సర్కార్ పై యతిప్రాసలతో తగులుకున్న గ్రీష్మ!
కడపలో అంగరంగవైభవంగా మొదలైన మహానాడులో టీడీపీ నేతలు ప్రసంగిస్తున్నారు.;
కడపలో అంగరంగవైభవంగా మొదలైన మహానాడులో టీడీపీ నేతలు ప్రసంగిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ ప్రభుత్వ విధానాలను వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడున్నారు. ఈ సందర్భంగా... గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... వైసీపీ ప్రభుత్వంపై కావలి గ్రీష్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... గత ప్రభుత్వంలో ఎగ్స్ కన్న ఎక్కువగా డ్రగ్స్ అమ్మారని, గల్లీల్లోనూ డ్రగ్స్ దొరికేవని, విద్యార్థులను మత్తుమందులకు బానిసలను చేసి, వారి భవిష్యత్తుపై దెబ్బ కొట్టారని మండిపడ్డారు. అయితే... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మదకద్రవ్యాలు, గంజాయిపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. దీనికోసం యాంటీనార్కోటిక్ టాస్క్ ఫోర్స్, ఈగల్ బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ క్రమంలో.. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని నిర్ణయించుకున్నారని వివరించారు.
ఈ సందర్భంగా... డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం తీర్మానాన్ని మహానాడులో గ్రీష్మ ప్రవేశపెట్టగా.. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త శశి బలపరిచారు. డ్రగ్స్ సరఫరాదారులు, తయారీదారుల్ని ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని, వాటిని రీహాబిలిటేషన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. ఇదే సమయంలో.. డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం అమ్ముతుంటే.. ఫోటోలు వాట్సప్ గవర్నెన్స్ లో నమోదు చేసేలా ఆప్షన్ ఇవ్వాలని చంద్రబాబుని విన్నవించారు.
ఈ సందర్భంగా... ఆరు శాసనాలను ప్రవేశపెట్టే, బలపరిచే సమయంలో నేతలు ప్రసంగించారు. వాటిపై వాట్సప్, ఐవీఆరెస్ ద్వారా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు. ఇలా సేకరించిన అభిప్రాయాల్లో... కొల్లు రవీంద్ర బాగా మాట్లాడారని 93.1% మంది చెప్పగా.. రవినాయుడు 86%, మద్దిపాటు వెంకట్రాజు 86%, వేణుగోపాల్ 85%, కావలి గ్రీష్మ 85% మంది చెప్పారు.