ట్రంప్ కి మరో బ్రేకప్ ?
జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన "ఎప్‌స్టీన్ ఫైల్స్" అమెరికా వ్యాప్తంగా సంచలనం రేపాయి.;
అమెరికా రాజకీయ వ్యవస్థను మరోసారి కుదిపేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ ప్రభుత్వానికి సమీప వర్గంగా భావించే, భారత సంతతికి చెందిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశాన్ని షేక్ చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం నేపథ్యంలో.. ఆయన ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని అమెరికా స్థానిక మీడియా ప్రచారం చేస్తోంది.
ఎప్‌స్టీన్ ఫైల్స్.. రాజకీయ భూకంపం
జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన "ఎప్‌స్టీన్ ఫైల్స్" అమెరికా వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు కాంటాక్ట్‌లలో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ బాధ్యత ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) చేతుల్లో ఉన్నప్పటికీ.. దర్యాప్తులో పారదర్శకత లేదని పలువురు అధికారులే విమర్శలు చేస్తున్నారు.
డాన్ బోంగినో రాజీనామా అంచనా
ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న డాన్ బోంగినో ఇటీవల సెలవుపై వెళ్లిన తర్వాత, ఆయన పామ్ బాండీ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. "బాండీ ఉండగానే తిరిగి విధుల్లోకి రావడం తనకు ఇష్టం లేదని" ఆయన పేర్కొన్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బోంగినో రాజీనామా చేస్తే.. కాష్ పటేల్ కూడా అదే బాటలో వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాష్ పటేల్ అసంతృప్తి కారణం
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కాష్ పటేల్.. పామ్ బాండీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోని కొన్ని కీలక పత్రాలను విడుదల చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘పామ్ బాండీ ఉండగానే దర్యాప్తు సరైన దిశగా సాగదనే’’ భావన కాష్‌లో ఏర్పడిందని స్థానిక జర్నలిస్టులు తెలిపారు.
ట్రంప్ వర్గాల్లో ఉత్కంఠ
ఈ పరిణామాలు ట్రంప్ శిబిరంలో తీవ్ర కలకలం రేపాయి. గతంలో ఎలాన్ మస్క్ "బిగ్ బ్యూటిఫుల్ బిల్లు" విషయంలో విభేదాలతో డోజ్ వదిలిన సందర్భం గుర్తుకు వస్తోంది. ఇప్పుడు కాష్ పటేల్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఎఫ్‌బీఐ – డీవోజే వ్యవహారంపై ట్రంప్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) శ్రేణుల్లో అసంతృప్తి
ఇక ట్రంప్ మద్దతుదారులైన MAGA వర్గాలు కూడా ఈ వ్యవహారంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాయని తెలుస్తోంది. లారా లూమర్ వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బాండీపై విమర్శలు గుప్పిస్తున్నారు. పారదర్శకత లోపించిందని, ప్రజలకు నిజాలు తెలియకుండా మౌనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చాయి.
- కాష్ పటేల్ పరిచయం
గుజరాత్‌కు చెందిన కుటుంబంలో జన్మించిన కశ్యప్ ప్రమోద్ పటేల్ (కాష్ పటేల్), న్యూయార్క్‌లో 1980లో జన్మించారు. మియామీలో లాయర్‌గా పనిచేసిన ఆయన, ట్రంప్‌కు దగ్గరయ్యి వెహికల్ లీగల్ అడ్వైజర్ హోదాలో పనిచేశారు. 2025 ఫిబ్రవరి 22న ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన భగవద్గీత మీద చేయి ఉంచి ప్రమాణం చేశారు.
ఈ క్రమంలో ఎఫ్‌బీఐలో పై స్థాయిలో మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. బోంగినో రాజీనామా చేస్తే.. వెంటనే కాష్ పటేల్ కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్‌బీఐ–డీవోజే మధ్య పోరు.. ఎప్‌స్టీన్ ఫైల్స్ నిజంగా ఏమి వెలికి తీయబోతున్నాయన్న ఉత్కంఠను మరింత పెంచుతోంది. పారదర్శకత కోసం పోరాడుతున్నవారికి ఇది ఓ కీలక మలుపు కావచ్చు.