రాష్ట్రపతికి కర్ణాటక ఆలయ పన్ను బిల్లు.. ఏమిటి దీని స్పెషల్?

కర్ణాటక రాష్ట్రంలో అటు అసెంబ్లీలోనూ, ఇటు శాసన మండలిలోనూ పాసైన ఓ బిల్లు గవర్నర్ వద్దకు చేరగా.. ఆ బిల్లును గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం కోసం పంపారు!;

Update: 2025-05-25 02:45 GMT

కర్ణాటక రాష్ట్రంలో అటు అసెంబ్లీలోనూ, ఇటు శాసన మండలిలోనూ పాసైన ఓ బిల్లు గవర్నర్ వద్దకు చేరగా.. ఆ బిల్లును గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం కోసం పంపారు! ప్రస్తుతం ఈ బిల్లు కర్ణాటకలో అధికార, ప్రతిపక్షాల మధ్య బిగ్ పొలిటికల్ ఫైట్ కి తెరలేపింది. అదే.. కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ (సవరణ) బిల్లు - 2024.

అవును.. కర్ణాటకలోని ధనిక దేవాలయాలపై పన్ను విధించే బిల్లు ఆసక్తికరంగా మారిన వేళ.. రాష్ట్రపతి ఆమోదం కోసం ఆ బిల్లును హస్తినకు పంపించారు ఆ రాష్ట్ర గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్. ఈ ఏడాది అటు శాసనసభ, ఇటు శాసనమండలి ఆమోదం పొందడంపై గవర్నర్లు నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిర్ణీత గడువును నిర్ణయించిన తర్వాత ఈ చర్చ వచ్చింది!

వాస్తవానికి ఈ సంవత్సరంలో ప్రారంభంలో పెద్ద రాజకీయ వివాదానికి దారితీసిన ఈ బిల్లు ప్రకారం... ఏడాదికి రూ. 10 లక్షల నుంచి రూ.1 కోటి వరకూ ఆదాయం వచ్చే దేవాలయాలపై 5 శాతం, రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలపై 10% లెవీని ప్రతిపాదించింది. దీని వెనుకున్న ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం వివరించింది.

ఇందులో భాగంగా... ఈ బిల్లు ద్వారా సేకరించిన మొత్తాన్ని ఒక ఏకీకృత నిధిలో జమ చేసి.. ఆ సొమ్మును చిన్న చిన్న దేవాలయాల సంక్షేమం, ఆర్థికంగా బలహీనంగా ఉన్న పూజారుల అభ్యున్నతి, వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు.. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలకు ఉపయోగిస్తామని ప్రభుత్వం తెలిపింది.

అయితే.. ఈ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం - బీజేపీ ల మధ్య పెను రాజకీయ వివాదానికి తెరలేపింది. ఇందులో భాగంగా.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానంగా బీజేపీ అభివర్ణించింది. ఇందులో హింస, మోసం, నిధుల దుర్వినియోగం తప్పకుండా జరుగుతుందని ఆరోపించింది.

ఇదే సమయంలో... ఈ చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాళీ ఖజానా నింపుకోవడానికి ప్రయత్నిస్తోందని కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యడియూరప్ప ఆరోపించారు. ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ఆదాయాన్ని ఎందుకు సేకరిస్తోంది.. ఇతర మత సంస్థల నుంచి ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నించారు!

Tags:    

Similar News