ఫీజు కట్టిన గురువుకు రిటైర్మెంట్ రోజు కారు బహుమతి
తాజాగా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. ఒక సాదాసీదా ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. తన విద్యార్థులకు పాఠాలు మాత్రమే చెప్పటంతో సరిపెట్టకుండా.. వారికి దన్నుగా నిలిచేవారు.
ఒక టీచర్ రిటైర్మెంట్ వేడుక జరుగుతున్న వేళ.. ఆయన వద్ద చదువుకున్న విద్యార్థుల్లో వెయ్యి మంది ఒక చోట చేరటం అరుదైన ఉదంతమైతే.. తండ్రి చనిపోయి.. చదువుకోవటానికి.. ఫీజులు కట్టేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించని వేళ.. అండగా నిలిచిన టీచర్ కు ఒక విద్యార్థి.. ఏకంగా ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన భావోద్వేగ ఉదంతం ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. టీచర్ - స్టూడెంట్ మధ్య ఉండే అనుబంధం ఎంత గొప్పదన్న విషయాన్ని తెలియజెప్పే ఈ ఉదంతం కొత్త స్ఫూర్తిగా మారటమే కాదు.. ఇలాంటి భావోద్వేగ బంధాలు ఇప్పుడున్న సమాజంలో మరింత ఎక్కువ అవసరమన్న భావన కలగటం ఖాయం. స్థానిక మీడియా మొదలు జాతీయ మీడియా వరకు ఈ ఉదంతాన్ని పెద్ద ఎత్తున కవర్ చేయటంతో.. ఈ ఉదంతం మీడియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు కారణమైందని చెప్పాలి.
ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సీఎస్ వస్త్రాద్ టీచర్ గా కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్ లోని కుమారేశ్వర హైస్కూల్ లో సైన్స్ టీచర్ గా.. హెడ్ మాస్టర్ గా సేవలు అందించారు. తాజాగా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. ఒక సాదాసీదా ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. తన విద్యార్థులకు పాఠాలు మాత్రమే చెప్పటంతో సరిపెట్టకుండా.. వారికి దన్నుగా నిలిచేవారు. బాగా చదివే విద్యార్థులను మరింత ప్రోత్సహించటం.. పేద విద్యార్థులకు తన వంతు సాయంగా ఏం చేయాలన్నా చేసేవారు. పాత రోజుల్లో గురువు - శిష్యుడి బంధం ఎలా ఉండేదో.. దాన్నే ఆయన పాటించేవారు.
అంతేనా.. సెలవు రోజుల్లో రూపాయి ఫీజు తీసుకోకుండా పిల్లలకు ప్రత్యేక తరగతులు చెప్పటంతో.. ట్యూషన్ నిర్వహించి వారు మరింత బాగా చదివేలా ప్రోత్సహించేవారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. వాణిజ్య పోకడలకు పోకుండా.. వీలైనంత వరకు తన విద్యార్థులకు అండగా నిలిచేవారు. ఈ కారణంతోనే ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కు ఏకంగా వెయ్యి మంది విద్యార్థులు హాజరు కావటం చూస్తే.. ఆయన తన విద్యార్థుల మీద ఎంతటి ప్రభావాన్ని చూపారో అర్థమవుతుంది. రిటైర్మెంట్ ఫంక్షన్ వేళ.. ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు ఆర్థిక సాయం బాధ్యతో చేశానే తప్పించి.. మరేమీ ఆశించలేదు. ఈ రోజు ఇంత మంది విద్యార్థులు తనను గౌరవించటానికి రావటంతో చూస్తే.. టీచర్ గా తాను సంపాదించుకున్న నిజమైన ఆస్తి తన విద్యార్థులే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి.
ఇక్కడితో ఈ ఉదంతం అయిపోలేదు. ఆ మాటకువస్తే.. ఇక్కడే మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిజానికి ఇదే మీడియాను.. జాతీయ మీడియాను విపరీతంగా ఆకర్షించిందని చెప్పాలి. ఆయన వద్దు చదువుకున్న చాలా మంది విద్యార్థుల్లో ఒకరు నవీన్ హులిహళ్లి. అతడి తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. తీవ్రమైన పేదరికంలో అతడి కుటుంబం ఉండేది. హానగల్ లోని కుమారేశ్వర హైస్కూల్ లో నవీన్ చదువుకోవటానికి అవసరమైన స్కూల్ ఫీజుతో పాటు.. పుస్తకాల్ని సీఎస్ వస్త్రాద్ చెల్లించేవారు. బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. పదో తరగతి పూర్తి అయిన తర్వాత కూడా ఆయనే అతడికి అండగా నిలిచేవారు. అతడి చదువుకు అవసరమైన ఫీజుల్ని చెల్లించేవారు. మొత్తంగా పీజీ అయ్యే వరకు నవీన్ కు అండగా నిలిచేవారు.
నవీన్ మీద టీచర్ గా పెట్టుకున్న నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. పీజీ పూర్తై.. ఒక ప్రముఖ ఐటీ కంపెనీలోఉద్యోగాన్ని సాధించారు. ప్రస్తుతం బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. తనకు గురువుగా మాత్రమే కాదు తండ్రిగా నిలిచిన సీఎస్ వస్త్రాద్ కు గురుదక్షిణ చెల్లించాలని నవీన్ భావించాడు.ఇందుకు తన గురువు రిటైర్మెంట్ ఫంక్షన్ ను వేదికగా చేసుకున్నారు. మారుతి సుజులికి స్విఫ్ట్ కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని ఎవరికి తెలీకుండా రహస్యంగా ఉంచారు. అప్పటికే ఆయన రిటైర్మెంట్ ను భారీ వేడుకగా జరిపేందుకు పూర్వ విద్యార్థులు నిర్ణయించిన వేళ.. వేదిక వద్దకు కొత్త కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకురావటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ వేడుకకు హాజరైన హుబ్బళ్లి మఠాధిపతి సమక్షంలో కారు తాళాల్ని తన గురువుకు బహుమతిగా అందించి..పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమానికి నవీన్ తో పాటు ఆయన తల్లి.. భార్య కూడా హాజరయ్యారు. చిన్నతనం నుంచి అండగా నిలిచిన తన గురువు.. రిటైర్మెంట్ జీవితంలో జరిపే ప్రయాణాలు సుఖవంతంగా సాగాలన్న ఉద్దేశంతోనే ఈ కానుకను ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అనూహ్య రీతిలో చోటు చేసుకున్న ఈ భావోద్వేగ సంఘటన అక్కడి వారిని మాత్రమే కాదు.. మీడియా ద్వారా బయటకురావటంతో పలువురిని కదిలిస్తోంది.