ఒకే వేదికపై సిద్దూ - డీకే.. ఎంత ఆత్మీయంగా కనిపించారో!
ఈ పంచాయితీని ఒక కొలిక్కి తెచ్చేందుకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకకు పంపింది అధిష్ఠానం.;
కడుపులో కత్తులు పెట్టుకొని పెదాల మీద నవ్వులు పూయించే టాలెంట్ కొందరికి ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు ఇద్దరూ ఈ తరహాలో ప్రదర్శించిన పెర్ ఫార్మెన్స్ అదిరేలా మారింది. ఓవైపు అధికార మార్పిడి కోసం డీకే పట్టుబడుతుండగా.. ఇంకోవైపు తననే ఐదేళ్లు సీఎంగా కంటిన్యూ చేయాలంటూ అంతే గట్టిగా ప్రయత్నిస్తున్న సిద్ధూ దెబ్బకు కాంగ్రెస్ అధినాయకత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది.
ఓవైపు వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పార్టీ అధినాయకత్వానికి సిద్దూ - డీకే ల మధ్య నడుస్తున్న పంచాయితీని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అధిక ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందంటూ సిద్దూ చెబుతుంటే.. అవన్నీ పక్కన పెడదాం.. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా రెండున్నరేళ్ల గడువు పూర్తైంది. ముఖ్యమంత్రి కుర్చీని తనకు కేటాయించాని డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు.
ఈ పంచాయితీని ఒక కొలిక్కి తెచ్చేందుకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకకు పంపింది అధిష్ఠానం. దీంతో.. ఇరు వర్గాలకు చెందిన నేతలు పోటాపోటీగా ఖర్గేను కలుస్తూ తమ వాదనల్ని వినిపిస్తున్నారు. వీరికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే తమ వాదనల్ని వినిపించారు. ఓవైపు ఇలా జరుగుతుంటే.. మరోవైపు శనివారం బెంగళూరు హెబ్బాళలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో ఈ ఇద్దరు ముఖ్యనేతలు అతిధులుగా హాజరయ్యారు. చేపల పెంపకం తదితర అంశాలపై శివకుమార్ ముఖ్యమంత్రికి వివరించగా.. ఆయన ప్రతిస్పందిస్తూ తలఊపారు. తమ మధ్య ఎలాంటి పంచాయితీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఇద్దరు పెర్ ఫార్మెన్స్ కు సభికులు ఆశ్చర్యపోయిన పరిస్థితి.
అధికార మార్పిడి వద్దని.. అధిక ఎమ్మెల్యేల బలం తనకే ఉందని.. డీకే వర్గాన్ని కంట్రోల్ చేసేందుకు తన వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి..మంత్రి పదవులు ఇవ్వాలనిసిద్దూకోరుతుంటే.. ఇచ్చిన మాట ప్రకారం అధికార మార్పిడి జరగాల్సిందేనన్న వాదనను వినిపిస్తున్నారు డీకే. ఈ నేపథ్యంలో ఖర్గే వీరి పంచాయితీని ఎలా తీరుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగామారింది. మరోవైపు ఏ నిర్ణయాన్నితీసుకుంటే మరేం జరుగుతుందోనన్న ఆందోళనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లుగా చెబుతున్నారు.