రాజు గారు రాజకీయం వదిలేశారా ?
అనకాపల్లి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఎలమంచిలి ఉంది. ఇపుడు జిల్లాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న ప్రాంతంగా కూడా ఇది ఉంది.;
అనకాపల్లి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఎలమంచిలి ఉంది. ఇపుడు జిల్లాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న ప్రాంతంగా కూడా ఇది ఉంది. ఎలమంచిలి అంటే రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతంగా అందరికీ గుర్తు వస్తుంది. ఇక్కడ సామాజిక రాజకీయ సమీకరణలు కూడా ఆసక్తిగా ఉంటాయి. ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉన్నా బీసీలు కూడ అంతే స్థాయిలో ఉన్నారు. మరో వైపు రాజులు కూడా ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. అనేక సార్లు వారు ఎమ్మెల్యే సీటు గెలిచి చట్ట సభలలో అడుగు పెట్టారు.
మొదటి నుంచి వారే :
ఇక ఎలమంచిలి నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఆనాటి నుంచి రాజులు కాపుల మధ్యనే రాజకీయం రంజుగా సాగుతూ వస్తోంది. మొదటి ఎమ్మెల్యే కాపుల నుంచి నెగ్గితే ఆ తరువాత ఎమ్మెల్యే రాజుల నుంచి వచ్చారు. అలా ఒక ఎన్నికలో ఒక సామాజిక వర్గం మరో ఎన్నికల్లో ఇంకో సామాజిక వర్గం నేతలకు ప్రజలు పట్టం కడుతూ వచ్చారు. ఇక 2004లో తొలిసారి కాంగ్రెస్ తరఫున కన్నబాబు రాజు ఎమ్మెల్యేగా గెలిచి చట్ట సభలో అడుగు పెట్టారు. ఆయనే 2009లో మరోసారి గెలిచారు. విభజన తరువాత టీడీపీలో చేరినా 2019 నాటికి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు 2024లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇలా నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచి తన సత్తా చాటుకున్నారు.
మౌన ముద్రలో :
ఇక కన్నబాబురాజుని మొదట్లో నియోజకవర్గం ఇంచార్జిగా వైసీపీ నియమించినా ఆ తరువాత చేసిన మార్పుచేర్పులలో కరణం ధర్మశ్రీని తీసుకుని వచ్చి అక్కడ అవకాశం ఇచ్చారు. కరణం ధర్మశ్రీ 2019లో చోడవరం నుంచి గెలిచారు. అంతకు ముందు ఆయన మాడుగుల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు ఇపుడు ఈ నియోజకవర్గం మూడవ రాజకీయ కేంద్రంగా ఉంది. కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి సామాజిక కోణంలో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అయితే కరణం ధర్మశ్రీకి ఇంచార్జి బాధ్యతలు అప్పగించడంతో కన్నబాబు రాజు ఫుల్ సైలెంట్ అయ్యారని అంటున్నారు.
దూరమైనట్లేనా :
ఇదిలా ఉంటే కన్నబాబు రాజు ఎక్కడా కనిపించడం లేదు, వైసీపీ కార్యక్రమాలలో అసలు పాలు పంచుకోవడం లేదు, దాంతో ఆయన పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఆయన మౌనం వెనక వ్యూహం ఉందని అనే వారూ ఉన్నారు. తన కుమారుడు సుకుమార్ వర్మకి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ హయాంలో వైసీపీ హయాంలో కూడా డీసీసీబీ చైర్మన్ గా సుకుమార్ వర్మ పనిచేశారు. 2024లో ఆయనకే టికెట్ కావాలని కన్నబాబు రాజు పట్టు పట్టారు. అయితే అధినాయకత్వం అందుకు అంగీకరించలేదు.
రాజకీయానికి కామా :
దాంతో 2029 నాటికైనా కుమారుడిని ముందుకు తేవాలని చూస్తున్నారు. వైసీపీలో అయితే కుదురుతుందా లేదా అన్న చర్చ ఉంది. అయితే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి చాన్స్ ఉంటుందని ఆశతో ఉన్నారని అంటున్నారు. ఒక వేళ అలా కుదరకపోతే ఆయన వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా కన్నబాబు రాజు రాజకీయానికి ఇది కామాయే కాని ఫుల్ స్టాప్ కాదు అని అంటున్నారు. చూడాలి మరి రాజా వారి రాజకీయం ఎలమంచిలిలో ఏ విధంగా సాగనుందో.