క‌న్నా క‌ల‌వ‌రం.. రాజ‌కీయాలు వ‌దిలేస్తున్నారా.. !

`కన్నా వారి కలవరం` అనే మాట తరచుగా వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు ఇక పుల్ స్టాప్ పెట్టే దిశగా ముందుకు సాగుతున్నార‌న్న చర్చ తెర‌మీదకు వచ్చింది.;

Update: 2026-03-09 13:30 GMT

`కన్నా వారి కలవరం` అనే మాట తరచుగా వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు ఇక పుల్ స్టాప్ పెట్టే దిశగా ముందుకు సాగుతున్నార‌న్న చర్చ తెర‌మీదకు వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప‌ల్నానాడుకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని ప్రస్తావించటం, అంతర్గత చర్చల్లో కూడా కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు దూరమవుతారు అన్న వాదన వినిపించడం ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ నిజమేన‌ని చెబుతున్నారు.

కాంగ్రెస్ తో ప్రారంభమైన కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలు.. తర్వాత కాలంలో బిజెపి వైపు మళ్లాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లాలని భావించినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని అప్పగించి ఆయనను తన వైపు తిప్పుకోగలిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో 2019 ఎన్నికల్లో ఆయన ద్వారా గెయిన్ అవ్వాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అది సక్సెస్ కాలేకపోయింది. త‌ర్వాత‌.. ఆయ‌న‌ టిడిపిలోకి రావడం, సత్తెనపల్లి టికెట్ను దక్కించుకోవడం, గత ఎన్నికల విజయం సాధించడం తెలిసిందే.

ఇంతవరకు బాగానే ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ లో ప్రధానంగా అసంతృప్తి నెలకొంది అన్నది వాస్తవం. చంద్రబాబు మంత్రివర్గంలో తనకు అవకాశం దక్కుతుందని ఆయన అంచనా వేసుకున్నారు. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత రాజకీయంగా ఆయన వేసిన అడుగుల కారణంగా ఆ పదవికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కోసం ఆయన ప్రయత్నించిన మాట వాస్తవమేనని ఆయన అనుచరులే చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు అవకాశం లేదన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక అసంతృప్తి మనసులో రగులుతున్న క్రమంలో నియోజకవర్గంలో కూడా కూటమి నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, కన్నా లక్ష్మీనారాయణను దాదాపు ఒక వర్గం పక్కన పెట్టడం వంటివి కూడా ఆయన రాజకీయాలను విరమించే అవకాశం ఉందన్న చర్చను తీసుకువచ్చాయి. ఇటీవల అంబటి రాంబాబు విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ పన్నెత్తు మాట కూడా అనలేకపోయారు.

సీఎం చంద్రబాబును వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు దూషించిన విషయం తెలిసిందే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసన వ్యక్తం చేశాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే ఏకంగా అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి నిరసన తెలిపారు. మరి అదే నియోజకవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ మౌనం పాటించారు. కేవలం ఏదో ముక్తసరిగా మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేసి సరిపుచ్చారు. ఇది కూడా టిడిపి నేతలకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

మొత్తంగా చూస్తే ఆయన అధికార పార్టీలో ఉన్నప్పటికీ దూరంగా ఉండడం, మనసులో అసంతృప్తిని పెంచుకున్న దరిమిలా వచ్చే ఎన్నికల నాటికి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉందన్న చర్చ జోరుగా వినిపించేలా చేస్తుంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

Tags:    

Similar News