ఎంపీ అభ్యర్థిగా కమల్ హాసన్ నామినేషన్
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీ కాలం జూన్ 24తో ముగియనుండటంతో ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 19న ఎన్నికల తేదీని ఖరారు చేసింది.;
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీ కాలం జూన్ 24తో ముగియనుండటంతో ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 19న ఎన్నికల తేదీని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో, డీఎంకే (DMK) తరఫున పి. విల్సన్, ఎస్.ఆర్. శివలింగం, కవయిత్రి సల్మాతో పాటు మిత్రపక్షమైన మక్కల్ నీది మయ్యం నుంచి ఆ పార్టీ అధినేత కమల్‌హాసన్ కూడా రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.
ఈ రోజు ఈ నలుగురు అభ్యర్థులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కమల్‌హాసన్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో సీఎం స్టాలిన్ స్వయంగా హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూన్ 24న పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులలో అన్బుమణి రామదాస్ (పీఎంకే), ఎన్. చంద్రశేఖరన్ (ఏఐఏడీఎంకే), ఎం. షణ్ముగం, మహ్మద్ అబ్దుల్లా, విల్సన్, వైకో ఉన్నారు.
-కన్నడ భాష వివాదంతో లేట్ గా నామినేషన్
నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. "తమిళం నుంచి కన్నడ భాష పుట్టింది" అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వివాదం చెలరేగుతున్న సమయంలో కమల్ హాసన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానానికి ముందే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా, దాన్ని వాయిదా వేసుకున్నారు. తన సన్నిహితులు, రాబోయే చిత్రం 'థగ్ లైఫ్' విడుదలయ్యే వరకు నామినేషన్ ప్రక్రియను వాయిదా వేయమని కమల్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారి సలహా మేరకు నేటి నామినేషన్ వాయిదా పడినట్లు సమాచారం.
-గత ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు
గతంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కమల్ హాసన్ పార్టీ MNM పూర్తి మద్దతు ఇచ్చింది. అంతేకాదు, తమిళనాడులో డీఎంకే తరపున ఆయన ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో, రాజ్యసభలో అడుగుపెట్టేందుకు డీఎంకే ఆయనకు పూర్తి సహకారం అందించనుంది.
జూన్ 19న జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కమల్ హాసన్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు MNM గత వారం ప్రకటించింది. MNM కమల్ హాసన్ పేరును ప్రతిపాదించగానే, డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనకు రాజ్యసభ సీటును కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2024లో MNM పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్టాలిన్ ఈ కేటాయింపు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం MNM పార్టీకి శాసనసభలో కానీ, పార్లమెంట్‌లో కానీ ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.