పంచాయతీ పోరు: బీజేపీకి షాకిచ్చిన కల్వకుర్తి!
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.;
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే.. కీలకమైన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇక్కడి బీజేపీ సానుభూతిపరులు, ఆ పార్టీ క్షేత్రస్థాయినాయకులు మూకుమ్మడిగా ఆదివారం బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీలక నాయకుడు హరీష్‌రావు నేతృత్వంలో సుమారు 60 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ ఎస్‌లో చేరారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని సాదరంగా ఆహ్వానించిన హరీష్‌రావు.. పార్టీ కోసం పనిచేయాలని వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసిన వారికి కేసీఆర్ పదవులు కూడా ఇవ్వనున్నారని భరోసా కల్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని.. హరీష్‌రావు విమర్శించారు.
స్థానికంపై ప్రభావమెంత?
క్షేత్రస్థాయిలో నాయకులు.. బీజేపీని వీడిపోవడంతో ఆ పార్టీపై ప్రభావం పడుతుందని పరిశీలకులు చెబు తున్నారు. ఇదేసమయంలో బీఆర్ ఎస్ పుంజుకుంటుందని అంటున్నారు. అయితే.. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు ఆశిస్తున్న బీఆర్ ఎస్‌కు ఆ పార్టీ నుంచి కాకుండా.. బీజేపీ నుంచి నాయకులు, కార్య కర్తలు రావడం గమనార్హం. అయితే.. ఎవరు వచ్చినా.. చేర్చుకునేందుకు తాము సిద్ధమేనని ఇటీవల కేటీఆర్ ప్రకటించిన విషయం గమనార్హం. ఇక, కల్వకుర్తిలో జరిగిన తాజా చేరికలపై బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు.