అన్నా రావాలా.. చెల్లి ఐయామ్ అవుటాఫ్ స్టేషన్.. కేటీఆర్ vs కవిత చాటింగ్
కవితకు బెయిల్ వచ్చేలా కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారు. రోజులు తరబడి ఢిల్లీలో ఉండి లీగల్, పొలిటికల్ లాబీయింగ్ చేసి ఆమెను విడుదల చేయించారు.;
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ విభేదాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. గత ఏడాది మద్యం కుంభకోణం కేసులో జైలుకెళ్లిన కవిత, రాఖీ పండుగ సమయానికి జైల్లో ఉండగా, పార్టీ మహిళా నాయకులు కేటీఆర్‌కు రాఖీ కట్టి ఆ లోటును తీర్చారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత కవిత స్వయంగా తన సోదరుడికి రాఖీ కట్టారు. ఆ సందర్భం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కవితకు బెయిల్ వచ్చేలా కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారు. రోజులు తరబడి ఢిల్లీలో ఉండి లీగల్, పొలిటికల్ లాబీయింగ్ చేసి ఆమెను విడుదల చేయించారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. కవిత రాసిన కొన్ని లేఖలు, చేసిన వ్యాఖ్యలు దయ్యాలు, గ్రీకువీరులు, కోవర్టులు అంటూ వచ్చిన ఆరోపణలు ఈ విభేదాలను మరింతగా ముదిర్చాయి. ఈ క్రమంలోనే కే.సి.ఆర్ కవితకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్తలు కూడా వెలువడ్డాయి.
ఇక తాజా పరిణామాలు రాఖీ పండుగ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సారి కవిత కేటీఆర్‌కు రాఖీ కట్టేందుకు ప్రయత్నించారని, ముందుగానే మెసేజ్ పంపారని సమాచారం. కానీ కేటీఆర్ “ఆవుట్ ఆఫ్ స్టేషన్” అని సమాధానమిచ్చారని తెలుస్తోంది. కవిత వస్తానంటే వద్దన్నట్లు ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇప్పటికే వారి మధ్య ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది కొనసాగితే పార్టీ అంతర్గత వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. గులాబీ దళపతి ఈ కుటుంబ కలహాలను ఎలా పరిష్కరిస్తారో, లేక ఇవి మరింత ముదిరి పార్టీకి సవాళ్లు సృష్టిస్తాయో అనేది చూడాల్సి ఉంది.