కాళేశ్వరం కాక : సీబీఐ ఎంట్రీ ఎపుడు ?
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విచారణ సంస్థగా సీబీఐకి పేరుంది. సీబీఐ విచారణని ఈ రోజుకి అంతా కోరుతారు ఏ కేసు అయినా తీవ్రం అని భావిస్తే సీబీఐకి ఇచ్చేయమంటారు.;
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విచారణ సంస్థగా సీబీఐకి పేరుంది. సీబీఐ విచారణని ఈ రోజుకి అంతా కోరుతారు ఏ కేసు అయినా తీవ్రం అని భావిస్తే సీబీఐకి ఇచ్చేయమంటారు. అంతలా నమ్మకం సీబీఐ మీద జనంలో ఉందని రాజకీయ జనం అభిప్రాయం. అందుకే సీబీఐ విచారణకు సిద్ధమేనా అని ప్రత్యర్ధులను సవాల్ చేస్తూంటారు. ఇదిలా ఉంటే తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి సీబీఐ విచారణ దాకా వెళ్ళింది. ఏకంగా తెలంగాణా ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ నిర్ణయం తీసుకుంది.
అతి పెద్ద ఖర్చుతో కూడిన ప్రాజెక్ట్ :
కాళేశ్వరం ప్రాజెక్ట్ ని భారీ ఎత్తున ఖర్చు చేసి మరీ నిర్మించారు. ఏకంగా ఒక లక్షా 47 వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు అయింది అని నివేదికలు చెబుతున్నారు. గోదావరి నీటిని ఒడిసిపట్టుకుని తెలంగాణా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి ఈ భారీ ప్రాజెక్ట్ ని తలపెట్టినట్లుగా బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉంటారు. అయితే అప్పులు భారీ వడ్డీలకు తెచ్చి మరీ ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారని అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని కానీ అప్పుల కుప్పలా తెలంగాణా మారడానికి ఒక కారణంగా మారిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆక్షేపిస్తోంది.
సీబీఐ అక్నాలెడ్జ్మెంట్ తో :
ఇదిలా ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తునామని తెలంగాణా ప్రభుత్వం చెప్పడమే కాదు సీబీఐకి తెలియజేసింది దాంతో సీబీఐ ఈ కేసు విషయంలో అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది. అంటే ఈ కేసు విషయంలో సీబీఐ ఏమి చేయబోతోంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది. మరో వైపు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ మీద హైకోర్టులో బీఆర్ఎస్ నాయకులు పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ వరకూ కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ఆదేశాలు జారీ చేసింది.
కేసుల భారంతో సీబీఐ :
మరో వైపు చూస్తే దేశంలో అత్యంత ప్రతిష్ట కలిగిన దర్యాప్తు సంస్థగా సీబీఐ ఉంది. దాంతో దేశవ్యాప్తంగా సీబీఐ మీద కేసుల భారం ఉంది. ఇప్పటిదాకా చూస్తే సీబీఐ పరిధిలో ఉన్న అవినీతి కానీ అక్రమాలపైన వివిధ కోర్టులలో విచారించే కేసుల సంఖ్య కానీ చూస్తే కనుక 7,022 ఉన్నట్లుగా చెబుతున్నారు ఇది ఎవరో చెప్పినది కాదు కేంద్ర నిఘా కమిషన్ ప్రతీ ఏటా ఇచ్చే నివేదికలో వెల్లడించింది. ఇవన్నీ పెండింగులో ఉండగా మరో 379 కేసులు అయితే ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా పెండింగులో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. అలాగే మరో 1506 కేసులు చూస్తే కనుక అవి 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి పెండింగులో ఉన్నాయని అంటున్నారు.
ఈ నేపధ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని తెలంగాణా ప్రభుత్వం సీబీఐని కోరింది. సీబీఐ ఈ కేసుని విచారించినా ఇప్పట్లో తేలుతుందా అన్నదే చర్చ. అంతే కాదు మరో మూడేళ్ళలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి అప్పటికి అయినా తేలే అవకాశాలు చూస్తే చాలా తక్కువ అని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే సీబీఐ ఎపుడు ఎంట్రీ ఇస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఇక సీబీఐ ఎంట్రీ ఇస్తే కనుక నోటీసులు ఇచ్చి మరీ బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలుస్తుందా అన్నది మరో ఉత్కంఠను కలిగించే విషయంగా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.