ఈ గాజు వంతెన వెరీ వెరీ స్పెషల్.. విశాఖ పర్యాటకానికి కొత్త అందం
దేశంలోనే అతిపెద్ద అద్దాల వంతనె ప్రారంభానికి సిద్ధమైంది. విశాఖ నగరంలోని కైలాస గిరి కొండపై ఏర్పాటు చేసిన గాజు వంతెనను డిసెంబరు 1న (సోమవారం) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.;
దేశంలోనే అతిపెద్ద అద్దాల వంతనె ప్రారంభానికి సిద్ధమైంది. విశాఖ నగరంలోని కైలాస గిరి కొండపై ఏర్పాటు చేసిన గాజు వంతెనను డిసెంబరు 1న (సోమవారం) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న విశాఖకు ఈ గాజు వంతెన మరింత సోయగం తెచ్చిపెట్టనుందని అంటున్నారు. అద్దాల వంతెనపై నుంచి సాగర తీరం, విశాఖ అందాలను వీక్షించేలా వీఎంఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. వాస్తవానికి ఆగస్టు నెలలోనే ఈ అద్దాల వంతెనను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. సముద్ర తీరంలో కైలాసగిరి పర్వతంపైన ఏర్పాటు చేసిన ఈ అద్దెల వంతెన సాహసవంతులకు సాదర స్వాగతం పలుకుతోంది.
గాలిలో తేలిపోవాలనుకునే వారికి కైలాగగిరిపై ఏర్పాటు చేసిన స్కై బ్రిడ్జి రమ్మని పిలుస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ అద్దాల బ్రిడ్జి.. విశాఖ పర్యాటక శోభను మరింత ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నారు. పీపీపీ విధానంలో సుమారు రూ.6 కోట్ల రూపాయలతో అద్దాల వంతెనను నిర్మించారు. సుమారు 50 మీటర్ల పొడవు ఉన్న కాంటిలివర్ గాజు వంతెనపై నుంచి స్కై వాక్ చేస్తూ టైటానిక్ వ్యూ పాయింట్ వరకు వెళ్లి సముద్ర తీరంలో అందాలను అస్వాదించవచ్చునని చెబుతున్నారు.
కైలాసగిరిపై ఏర్పాటు చేసిన కాంటిలివర్ గాజు వంతెన దేశంలోనే అతిపెద్దది. ప్రస్తుతం ఈ తరహా గాజు వంతెన కేరళలో మాత్రమే ఉంది. విశాఖలో 50 మీటర్ల వంతెన ప్రారంభమైతే దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంది. కేంటి లివర్ విధానంలో కింద ఎటువంటి ఆధారం లేకుండా ఈ వంతెన నిర్మించారు. సముద్రపు గాలికి తుప్పు పట్టని స్టీల్ ను గాజు వంతెన నిర్మాణానికి వినియోగించారు. ఈ స్టీల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోగా, అద్దాలు, రోప్ లు బెంగళూరులో తయారు చేయించారు. వంద మంది పర్యాటకులు ఒకేసారి వెళ్లినా తట్టుకోగల సామర్థ్యంతో గాజు వంతెన తయారైంది. సాహసం చేయాలనే అభిరుచి ఉన్నవారికి ఈ వంతెన పై స్కై వాక్ చేయడం చిరకాలంగా గుర్తుండిపోతుందని అంటున్నారు.
ఒకేసారి 500 టన్నుల భారం మోయగలిగే సామర్థ్యంతో వంతెనను నిర్మించినా, భద్రతా కారణాల దృష్ట్యా ఒకసారి 40 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఇక రాత్రి వేళ వంతెన మరింత అందంగా కనిపించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్ దీపాలను వంతెనకు అమర్చడంతో రాత్రిపూట కూడా వంతెన మెరిసిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రవేశ రుసుము ఎంత నిర్ణయించాలనేది నిర్ణయించలేదు. సోమవారం ఎంపీ శ్రీభరత్ చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత ప్రవేశ రుసుంపై ప్రకటన ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.