కదిరిలో కందికుంట స్ట్రాటజీ.. వైసీపీకి భారీ షాక్.. !
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్.. చాలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.;
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్.. చాలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను కట్టడి చేయడమే కాదు.. వైసీపీని భారీ ఎత్తున ఇరుకున పెట్టేలా స్టాటజీ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తం గా స్థానిక సంస్థలను కూటమి నాయకులు తమ వైపు తిప్పుకొంటున్న విషయం తెలిసిందే. దీనిని తప్పు బట్టాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా కదిరి మునిసిపాలిటీపైనా.. కందికుంట వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. దీనిని దక్కిం చుకునేందుకు చాలా రాజకీయం ప్లే చేశారు. సక్సెస్ కూడా అవుతున్నారు. మొత్తం వైసీపీ చేతిలో ఉన్న కదిరి మునిసిపాలిటీలో కొన్నాళ్ల కిందటి వరకు టీడీపీ ఉనికి పెద్దగా లేదు. కానీ, గత ఏడాది ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కందికుంట.. ఇక్కడ పాగా వేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీలోని టీడీపీ సానుభూతి పరులను తనవైపు తిప్పుకొన్నారు. పైగా.. వైసీపీని ముందుం డి నడిపించే నాయకులు కూడా కరువయ్యారు. ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండ డంతో కదిరి మునిసిపల్ రాజకీయాలు దారి తప్పాయి. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి పదుల సంఖ్యలో కౌన్సిలర్లు .. టీడీపీ గూటికి చేరిపోయారు. ప్రస్తుతం కదిరి మునిసిపాలిటీలో 25 మంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారు.
మరో 11 మంది మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. దీంతో కదిరి మునిసిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు.. కందికుంట వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గత రెండు రోజులుగా కౌన్సిలర్లను బెంగళూరులోనే ఉంచి.. వారిని జాగ్రత్తగా కాపాడుకున్నారు.. తాజాగా సోమవారం సాయంత్రం.. చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీనిలో విజయం దక్కించుకునేలా.. మరింత మందిని వైసీపీ నుంచి తనవైపు తిప్పుకొనేలా కందికుంట ప్రయత్నిస్తున్నారు. ఇది జరిగినా.. జరగక పోయినా.. కదిరి ఇప్పటికే టీడీపీ వశం అయిందని అంటున్నారు పరిశీలకులు.