కడప స్టీల్.. అయ్యే పనేనా?
రాయలసీమ వాసుల దశాబ్దాల కల కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.;
రాయలసీమ వాసుల దశాబ్దాల కల కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో జేఎస్ డబ్ల్యూ కంపెనీ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. 2026 నాటికి సర్వే పనులు ప్రారంభించి 2029 నాటికి ఉత్పత్తి మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్లాంట్ నిర్మాణం కోసం ప్రస్తుతం సర్వే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మే నెలలో కడపలో మహానాడు నిర్వహించిన టీడీపీ కడప స్టీల్ ప్లాంట్ పనులు పది రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన ఎలా ఉన్నా ఇప్పుడు ప్లాంట్ నిర్మాణానికి సర్వే జరుగుతుండటంతో కడప స్టీల్ పై మళ్లీ చర్చ జరుగుతోంది.
నాలుగు సార్లు శంకుస్థాపనలు
కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదన దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమవుతోంది. గత ఇరవయ్యేళ్లలో నాలుగు సార్లు ఈ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగినా ఇప్పటివరకు పునాది పడలేదు. దీంతో ఈ సారైనా కడప స్టీల్ పనులు జరుగుతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కడప స్టీల్ ప్లాంట్ నిర్మించి ఇచ్చిన మాట నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. అంతేకాకుండా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం రాజకీయంగా చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో ఈ పరిశ్రమపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ఫోకస్ చేశారని అంటున్నారు.
రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తొలిసారి శంకుస్థాపన చేశారు. అప్పట్లో అనంతపురం జిల్లాలో ఓబులాపురంలో ఇనుప ఖనిజం మైనింగ్ జరగడంతో కడప స్టీల్ పై ఆశలు చిగురించాయి. అయితే ఆ తర్వాత ఓబులాపురం మైనింగ్ వివాదాస్పదం కావడంతో కడప స్టీల్ ముందుకు కదల్లేదు. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన శంకుస్థాపన చేశారు. అయితే వెంటనే ఎన్నికలు రావడంతో రెండోసారి పనులు జరగలేదు.
2019 ఎన్నికలకు ముందు
2019 ఎన్నికల తర్వాత కడప జిల్లాకు చెందిన జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన తండ్రి ప్రతిపాదించిన కడప స్టీల్ ప్లాంట్ పనులను తానే పూర్తి చేస్తానని జగన్ ప్రకటించారు. అంతేకాకుండా కడప స్టీల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో శంకుస్థాపన జరగాలని, దిగిపోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేయరని ఆక్షేపించారు. అలా ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో శంకుస్థాపన చేసినా ఐదేళ్లలో కనీసం ఒక్క ఇటుక పేర్చ లేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జేఎస్ డబ్ల్యూ యాజమాన్యంతో చర్చించి నాలుగోసారి కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఏడాదైనా పనులు ముందుకు కదల్లేదు.
రెండు సార్లు జగన్ శంకుస్థాపన
ఇలా కడప ఉక్కు పరిశ్రమకు నాలుగు సార్లు శంకుస్థాపనలు జరగడంతో ఇప్పుడు కూడా పనులు ప్రారంభించే వరకు నమ్మకం కుదరడం లేదని స్థానికులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కడప స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి వుంది. అయితే కేంద్రం నుంచి పరిశ్రమ ఏర్పాటుకు సానుకూల సంకేతాలు అందకపోవడంతో ప్రైవేటు రంగంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే జేఎస్ డబ్లూ ముందుకు రాగా, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది.
1100 ఎకరాల భూ కేటాయింపు
దీంతో జేఎస్ బ్ల్యూ ఆధ్వర్యంలో కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో 1100 ఎకరాల్లో స్టీల్ పరిశ్రమకు ముందడుగు పడినట్లైంది. రూ.11,850 కోట్లతో రెండు దశల్లో పనులు చేయాలని నిర్ణయించగా, ఎకరా రూ.5 లక్షల చొప్పున 1100 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి, 2034 నాటికి రెండో దశ విస్తరణ పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ప్రభుత్వ సూచనల మేరకు నాలుగు నెలల్లో పనులు ప్రారంభించాల్సి ఉండగా, ప్రస్తుతం సర్వే పనులు జరుగుతున్నాయి. దీంతో కడప స్టీల్ పై ఆశలు చిగురిస్తున్నాయి.