కడప జిల్లా ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు దూరం

కడప జిల్లాలో ఒక ఫైర్ బ్రాండ్ లాంటి లీడర్ ఉన్నారు. ఆయన అన్ని పార్టీలు చుట్టి వచ్చారు. అయినా తన ఇమేజ్ తో గెలుస్తూ వస్తున్నారు;

Update: 2025-10-05 03:58 GMT

కడప జిల్లాలో ఒక ఫైర్ బ్రాండ్ లాంటి లీడర్ ఉన్నారు. ఆయన అన్ని పార్టీలు చుట్టి వచ్చారు. అయినా తన ఇమేజ్ తో గెలుస్తూ వస్తున్నారు. ఆయనే ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగు ఆది అంటే అందరికీ అక్కడ పరిచయం. ఆయన ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నారు. తాజాగా స్థానికంగా జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయం ఇక చాలు అని చెప్పేశారు. తాను ఇక మీదట పోటీ చేయదలచుకోలేదని తనకు ఆసక్తి కూడా లేదని యువతకు అవకాశాలు రావాలని ఆయన చెప్పడం కూడా విశేషం. దాంతో ఆదినారాయణ రెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయింది అని అంతా అంటున్నారు.

కాంగ్రెస్ నుంచి ఎంట్రీ :

ఇదిలా ఉంటే 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ఆదినారాయణరెడ్డి వైఎస్సార్ చలవతో రాజకీయంగా ఎదిగారు. ఆయన రెండు సార్లు జమ్మలమడుగు నుంచి గెలిచి వచ్చారు. ఇక 2014 నాటికి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయిన ఆది నారాయణ రెడ్డి 2017లో టీడీపీలో చేరారు. అలా సైకిలెక్కి ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. తన చిరకాల కోరిక అయిన మంత్రి పదవిని రెండేళ్ళ పాటు చేపట్టి సంతృప్తి చెందారు. ఇక 2019 ఎన్నికల్లో కడప నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు.

మరో చాన్స్ మిస్ :

ఇక బీజేపీ కూటమిలో చేరడంతో పొత్తులో భాగంగా జమ్మలమడుగు అసెంబ్లీ సీటుని సాధించారు మంచి మెజారిటీతో గెలిచారు. కూటమి ఏపీలో అధికారంలోకి రావడంతో మంత్రి పదవి మీద ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఆనీ అది జరగలేదు. ఇక ఏణ్ణర్ధం కూటమి పాలనకు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సామాజిక సమీకరణలు అన్నీ కూడా ఆదినారాయణరెడ్డి కి అర్ధం అయ్యాయని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదుల వయసుకు చేరువ అవుతారు దాంతో ఇక చాలు ఈ రాజకీయం అనుకుంటున్నారు అని చెబుతున్నారు.

వారసుడు ఆయనే :

ఇక జమ్మలమడుగులో టీడీపీకి ఇంచార్జిగా ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నిజానికి 2024లో ఆయనకే టికెట్ దక్కాల్సింది. అయితే పొత్తులో భాగంగా బాబాయ్ ఆది నారాయణరెడ్డి తీసుకున్నారు. ఆనాడే ఒక ఒప్పందం కుదిరింది అని అంటున్నారు. దాని ప్రకారమే 2029 లో భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. అలా తన అన్న కుమారుడినే తన రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేస్తూ ఆది రాజకీయ విరమణ చేయనున్నారు అని అంటున్నారు.

బలమైన నేతగా :

ఇదిలా ఉంటే ఆది నారాయణరెడ్డి బలమైన నేత మాత్రమే కాదు వ్యూహకర్తగా పేరు పొందారు. ఎపుడు ఎక్కడ ఉంటే అధికారానికి చేరువగా ఉంటామని ఆయనకు బాగా తెలుసు అని చెబుతారు. అధికార కాంగ్రెస్ లో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో మూడేళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత అధికార టీడీపీలో చేరి మంత్రి అయ్యారు ఇక 2019 తరువాత బీజేపీలో చేరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేగా పవర్ ఫుల్ గా ఉన్న్నారు. మొత్తానికి తన రాజకీయ జీవితాన్ని అధికార పార్టీలలోనే గడిపిన ఆయన జగన్ నాయకత్వంలోని వైసీపీలో చేరి అతి తక్కువ సమయంలోనే ఆయనతో వేరుపడి ప్రస్తుతం జిల్లాలో ఆయనకు ధీటైన రాజకీయ ప్రత్యర్ధి గా ఉన్నారు.

Tags:    

Similar News