గోదావరి జిల్లా పెద్దాయనకు రెండు సీట్లు కావాలట !
ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు పై దాటి సమయం ఉంది. కానీ ఆశావహులకు మాత్రం ఆరాటాలు ఎక్కువ అవుతున్నాయి.;
ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు పై దాటి సమయం ఉంది. కానీ ఆశావహులకు మాత్రం ఆరాటాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వారు అయితే ఎన్నికలు రేపే అనేలా హడావుడి చేయవచ్చు కానీ అధికారంలో ఉన్న వారు మరో ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేయడమేంటి అన్నదే అసలైన హాట్ డిస్కషన్ గా ఉంది. విషయానికి వస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన ముఖ్య నాయకుడు అయిన జ్యోతుల నెహ్రూ వచ్చే ఎన్నికల గురించి అపుడే మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారుట.
షిఫ్ట్ అవుతాను అంటూ :
వచ్చే ఎన్నికల్లో తాను జగ్గంపేట నుంచి పోటీ చేయనని వేరే సీటుకు షిఫ్ట్ అవుతాను అని తాజాగా జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. తన కుమారుడు జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ జ్యోతుల నవీన్ జగ్గంపేట నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని ఆయన చెబుతున్నారు. అంటే 2029 ఎన్నికల్లో రెండు టికెట్లు తమ కుటుంబానికి కావాలని ఇప్పటి నుంచే జ్యోతుల వారు టెండర్ పెట్టారు అని అంటున్నారు.
మంత్రి పదవి కోసమేనా :
ఇదిలా ఉంటే జగ్గంపేట నుంచి ఇప్పటికి ఆరు సార్లు పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జ్యోతుల నెహ్రూ. అది కూడా మూడు పార్టీల నుంచి గెలిచారు. ఇక ఆయన మొత్తం రాజకీయ జీవితం మూడున్నర దశాబ్దాలు దాటినా ఇప్పటిదాకా మంత్రి అయితే కాలేదు, దానికి కారణం పొలిటికల్ జంపింగ్స్ అని అంటున్నారు. ఆయన 2014లో టీడీపీ గెలిచిన నాటికి వైసీపీలో ఉన్నారు. ఇక 2019లో వైసీపీ గెలిచిన నాటికి టీడీపీలో ఉన్నారు. అంతకు ముందు కూడా అలాగే జరిగింది. తీరా 2024లో ఆయన గెలిచారు, టీడీపీ అధికారంలో ఉంది. కానీ కూటమి పార్టీలతో పొత్తులతో సామాజిక సమీకరణలతో ఆయనకు మంత్రి పదవి అయితే దక్కలేదు అని అంటున్నారు. మంత్రి కావాలన్నది ఆయన జీవితాశయంగా చెబుతున్నారు. రాజకీయంగా రిటైర్ కావాలీ అంటే మాజీ మంత్రిని అనిపించుకోవాలని ఆయన ఉబలాటపడుతున్నారుట.
ఆ రెండో సీటు ఎక్కడో :
సరే ఆయన మంత్రి పదవి ఆశలు బాగానే ఉన్నా రెండవ సీటు ఎక్కడ అన్నది పార్టీలో చర్చగా ఉంది. జగ్గంపేటలోనే మిత్రుల నుంచి ఈసారి పోటీ ఉంటుందని చెబుతున్నారు. అయితే జ్యోతుల ఫ్యామిలీ మీద అభిమానంతో ఆ సీటు వదిలేస్తారు కానీ మరో సీటు కాకినాడ జిల్లాలో జ్యోతుల కుటుంబానికే ఇవ్వాలీ అంటే కుదిరే పనేనా అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు పొత్తులు అపుడు కూడా ఉంటాయి. ఇంకా ఎక్కువ డిమాండ్లు ఉంటాయి. దాంతో ఒక్కో సీటు మీద గట్టిగా పీట ముడి బిగుసుకుంటుందని అటువంటి సమయంలో జ్యోతుల నెహ్రూ కుటుంబానికే రెండవ సీటు ఇవ్వడం అంటే జరిగే పనేనా అన్న చర్చ సాగుతోంది. అయితే జ్యోతుల నెహ్రూ మాత్రం తన మనసులో మాటను బయట పెట్టేశారు అని అంటున్నారు. ఇక జిల్లాలో మిగిలిన నేతలు ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందో అని చూసుకోవాల్సిందే అని అంటున్నారు. రెండవ సీటు సేఫ్ జోన్ లో చూసుకోకుండా జ్యోతుల నెహ్రూ ఈ మాటలు అనరని అంటున్నారు. సో అదన్న మాట సంగతి.