జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కి అతిరధులంతా !
ఇక తెలంగాణా నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవికి పోటీ పడుతున్న సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాల దాఖలుకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతున్నారు.;
తెలుగు తేజం న్యాయ కోవిదుడు రాజ్యాంగ నిపుణుడు అయిన జస్టిస్ సుదర్శన్ ప్రతిష్టాత్మకమైన ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఇండియా కూటమి తరఫున ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఆయన తన నామినేషన్ పత్రాలను ఈ నెల 21న అంటే గురువారం దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ ఎన్నికల రిటర్న్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలను అందచేస్తారు. ఇక సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు ఘట్టానికి ఇండియా కూటమి నుంచి అతిరధ మహారధులు హాజరవుతారని తెలుస్తోంది.
ప్రత్యేక ఆకర్షణగా ఆయన :
ఇక తెలంగాణా నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవికి పోటీ పడుతున్న సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాల దాఖలుకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతున్నారు. ఆయన ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. అలాగే కాంగ్రెస్ కి చెందిన ముఖ్యమంత్రులతో పాటు ఇండియా కూటమికి చెందిన కీలక నాయకులు అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా సకల చర్యలను తీసుకుంటున్నారు.
అనూహ్యంగా ఆప్ మద్దతు :
జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్ధిత్వానికి అనూహ్యంగా ఆప్ మద్దతు ప్రకటించింది. ఆప్ చాలా కాలంగా ఇండియా కూటమికి దూరంగా ఉంటోంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ వేరుగా పోటీ చేశాయి. దాంతో మధ్యలో బీజేపీ గెలిచింది. ఆప్ ఓటమి పాలు అయింది. ఈ పరిణామం తరువాత ఆప్ ఇండియా కూటమిని పూర్తిగా పక్కన పెడుతోంది. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. పైగా మాజీ న్యాయమూర్తి. దాంతో ఆయన అభ్యర్ధిత్వం పట్ల ఆప్ తన సపోర్టుని తెలియచేసింది. ఇక నామినేషన్ వేళ ఆప్ ప్రతినిధులు కూడా హాజరవుతారని అంటున్నారు.
వీరంతా పట్టుదలగా :
మరో వైపు ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ఆర్జేడీ సమాజ్ వాదీ పార్టీ వంటి పెద్ద పార్టీలు తమ పక్షం నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడానికి పట్టుదలగా పనిచేస్తున్నాయి. అందుకే ఈ పార్టీలకు చెందిన ఎంపీలు ఆయన నామినేషన్ వేళ ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని అంటున్నారు. అంతే కాదు ఇతర పార్టీల మద్దతుని కూడగట్టడంలో సైతం వీరంతా గట్టిగా పనిచేస్తారని అంటున్నారు.
క్రాస్ ఓటింగ్ జరిగేనా :
సాధారణంగా ఇవి పార్టీ రహిత ఎన్నికలు పైగా స్వేచ్చగా ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటు చేయవచ్చు. విప్ సైతం జారీ చేసేది ఉండదు. ఎవరి మనోభావాలకు ఆత్మ ప్రభోదం మేరకు ఓటు వేసినా వారి సభ్యత్వం రద్దు కాదు చర్యలు సైతం తీసుకునే వీలు ఉండదు. అందువల్ల ఇపుడు చూస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా అవతల పక్షం నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అన్న చర్చ ఉంది. పైగా ఆయన కూడా ఎంపీలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ ఇండియా కూటమి చేసిన మరో తెలివైన పని ఏమిటి అంటే రాజకీయ పార్టీలకు చెందిన వారిని బరిలోకి దించకపోవడం. దాంతో రాజకీయాలకు అతీతతంగా ఓట్లు అటు నుంచి ఇటు పడతాయని ఇండియా కూటమి ధీమాగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.