జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు తిప్పలు.. కేసులపై కేసులు!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఘట్టం ఇలా మొదలైందో లేదో.. అప్పుడే కాంగ్రెస్ పార్టీపై కేసులు నమోదవుతున్నాయి.;
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఘట్టం ఇలా మొదలైందో లేదో.. అప్పుడే కాంగ్రెస్ పార్టీపై కేసులు నమోదవుతున్నాయి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై సెక్షన్ 123(1), 123(2), బీఎన్ఎస్ 170, 171, 174 కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు కూడా దూకుడు తగ్గించాలి. కానీ.. ఏమనుకున్నారో.. ఏమో కాంగ్రెస్ నాయకుడు.. నవీన్ యాదవ్.. రెచ్చిపోతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ఫేక్ ఓటర్ ఐడి కార్డులు పంచారు. దీనిని ఎన్నికల ప్రక్రియలో తీవ్రమైన నేరంగా పరిగణించిన అధికారులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు.. నకిలీ ఓటరు ఐడీ కార్డులు పంచే క్రమంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని ఎన్నికల అధికారికి అందిన ఫిర్యాదుపై నవీన్ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు.. సాధారణ పోలీసులు కూడా ఈ వ్యవహారంపై కేసు పెట్టారు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే.. మరోవైపు.. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జూబ్లీహిల్స్ లో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అది కూడా కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ కావడం మరింత దుమారం రేపింది. ఒక వైపు 3 రోజుల క్రితం ఓటర్ కార్డులు పంచి వివాదంలో చిక్కుకోగా, ఇప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టేలా కుట్టు మిషన్లు పంచడంతో నవీన్ యాదవ్ వ్యవహారంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. నవీన్ యాదవ్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బీఆర్ ఎస్, బీజేపీ నాయకులు కూడా కోరుతున్నారు.
ఇంకో వైపు .. అసలు తాము రంగంలోకి దిగకుండానే ఈ వివాదాలకు తెరలేపడం ఏంటని కాంగ్రెస్ పార్టీ కూడా విస్మయం వ్యక్తం చేస్తోంది. కాగా.. నవీన్ యాదవ్.. ఓ కీలక నాయకుడి అనుచరుడిగా చెబుతున్నా రు. ఇంకా టికెట్ ఖరారు కాకపోయినా.. తన హవాను నిరూపించుకునేందుకు సదరు నాయకుడు ఇలా.. చేస్తున్నాడని చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ముదురుతున్న క్రమంలో నవీన్ యాదవ్ ఎవరు? ఎక్కడి నుంచివచ్చాడు? అనే విషయాలపై పార్టీ కూపీలాగుతుండడం గమనార్హం.