జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ టెన్షన్

తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. సిట్టింగు స్థానాన్ని నిలబెట్టుకోడానికి శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ కి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది.;

Update: 2025-10-13 17:00 GMT

తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. సిట్టింగు స్థానాన్ని నిలబెట్టుకోడానికి శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ కి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. బీఆర్ఎస్ పూర్వ నామం టీఆర్ఎస్ పేరుతో ఒకరు పోటీలో నిలవడంతో గులాబీ పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. అచ్చు బీఆర్ఎస్ పార్టీని పోలినట్లే జెండా, అజెండా ప్రచారం చేస్తుండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.

గతంలో కూడా పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో దెబ్బతీశారు. రోడ్డ రోలర్, చపాతి మేకర్, ఇస్త్రీ పెట్టే ఇలా చాలా ఎన్నికల గుర్తులు బీఆర్ఎస్ కారు గుర్తును పోలినట్లు ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యేవారు. ఎన్నికల ఫలితాల్లో అనామకులకు ఐదారు వేల ఓట్లు పోలవడం చూసి కారుకు డ్యామేజి జరిగిందని చెప్పేవారు. గత ప్రభుత్వంలో కూడా ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఇలాంటి గందరగోళం కారుపార్టీ నేతలను కంటిమీద కునుకు లేకుండా చేసింది.

దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముందే మేల్కొంది. కారు గుర్తులా కనిపించే యుగ తులసి పార్టీతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒప్పందం కుదుర్చుకుంది. యుగ తులసి పార్టీ ఎన్నికల గుర్తు రోడ్డు రోలర్ చూసేందుకు తమ పార్టీ గుర్తు కారు మాదిరిగానే కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ద్రుష్టికి తీసుకువెళ్లింది. రోడ్డు రోలర్ గుర్తును మార్చాలని ఈసీని కోరింది. కానీ, ఈసీ అందుకు అంగీకరించకపోవడంతో మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యుగ తులసి పార్టీ నేతలతో మాట్లాడి పోటీకి దూరంగా ఉండేలా ఒప్పించారు.

ఇక తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్-డెమొక్రటిక్ రూపంలో బీఆర్ఎస్ కు సవాల్ ఎదురవుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ (డి) పార్టీ తరఫున ఓ అభ్యర్థి పోటీకి రంగం సిద్ధం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ తన పేరు మార్చుకోకముందే జనబాహుళ్యంలో టీఆర్ఎస్ గానే ప్రసిద్ధి చెందింది. అయితే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఆ పేరు ఎవరూ వాడుకోకుండా చూడాలని ఈసీని గతంలో కోరింది. కానీ, అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు తిప్పలు పడుతోందని అంటున్నారు. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పేరుతో జూబ్లీహిల్స్ పోరుకు సై అంటున్న అభ్యర్థి... గులాబీ రంగు బ్యానర్లతో హడావుడి చేస్తున్నాడు. దీంతో ఓటర్లు గందరోగళానికి గురయ్యే ప్రమాదం ఉందని గులాబీ పార్టీ నేతలు భయపడుతున్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీయే కుట్రతో ఇలాంటి ఎత్తులు వేస్తోందని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయన స్థానికుడు కావడం, ఆయన తండ్రి చిన శ్రీశైలం యాదవ్ నేపథ్యంతో ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. సిటింగు స్థానం నిలుపుకోవడం బీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్-డీ రూపంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎలా అధిగమించాలో అర్థం చేసుకోలేక ఆ పార్టీ నేతలు జుట్టు పీక్కుంటున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News