రేవంత్ కూడా 'టీడీపీ' పాటే!
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నట సార్వభౌమ ఎన్టీఆర్ సహా.. ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు గురించి.. కీలక నాయకులు ప్రస్తావిస్తున్నారు.;
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మాట జోరుగా వినిపిస్తోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నట సార్వభౌమ ఎన్టీఆర్ సహా.. ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు గురించి.. కీలక నాయకులు ప్రస్తావిస్తున్నారు. గురువారం బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఓ మీడియాకుఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, చంద్రబాబుల గురించి ప్రస్తావించారు. తాజాగా ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నేతల గురించి ప్రసంగంలో ప్రస్తావించారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీలో లేకున్నా.. ఆ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వకపోయినా.. ఆ పార్టీ ప్రస్తావన, ఆ పార్టీ నాయకుల ప్రస్తావన మాత్రం కొనసాగుతుండడం గమనార్హం.
రేవంత్ ఏమన్నారంటే..
వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసిన సంగతిని ప్రస్తావించారు. ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు చంద్ర బాబుకు మద్దతుగా నిలిచారని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే.. అదేసమయంలో హైదరాబాద్‌లో చంద్రబాబుకు అనుకూలంగా నిరసనలు చేసిన వారిని అరెస్టు చేయించారని అప్పటి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారికి ఎవరు మద్దతు ఇస్తారంటూ.. టీడీపీ సానుభూతి పరులను ప్రస్తావిస్తూ.. పరోక్షంగా వ్యాఖ్యానించారు. నిజానికి అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఏకమయ్యారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ సహా హైదరాబాద్, ట్యాంక్ బండ్ వద్దఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
కానీ, పోలీసులు వారిని అనుమతించలేదు. ఇదే విషయంపై అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ స్పందిస్తూ.. ఏపీలో అరెస్టు చేస్తే.. అక్కడకు వెళ్లి నిరసన వ్యక్తం చేయాలని.. హైదరాబాద్, సైబరాబాద్‌లో ఉద్యమాలు చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తాజాగా రేవంత్ రెడ్డీ ఈ వ్యాఖ్యలనే గుర్తు చేశారు. ఇక, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విషయాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. నెక్లెస్ రోడ్డులో, సచివాలయానికి పక్కన ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను తొలగించాలని బీఆర్ ఎస్ ప్రభుత్వం అప్పట్లో తీవ్ర ప్రయత్నం చేసిందన్నారు. ఇది ఆయనను అవమానించినట్టు కాదా? అని ప్రశ్నించారు. అలాంటి వారికి `ఎవరైనా`(టీడీపీ సానుభూతి పరులు కావొచ్చు) ఓటేస్తారా? అని నిలదీశారు.
ఇక, మరిన్ని విషయాలను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. బీఆర్ ఎస్‌ను చీల్చేందుకు.. ఆ పార్టీలో చిచ్చు పెట్టేందుకు హరీష్‌రావు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే.. అనేక మందిని బయటకు పంపారని చెప్పారు. కేటీఆర్ వెంట ఉండే వాళ్లనే హరీష్‌రావు టార్గెట్ చేసుకుంటున్నారని చెప్పారు. అందుకే కవితకు చిచ్చు పెట్టి బయటకు పంపించారని ఆరోపించారు. హరీష్‌రావుకు ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉందని.. బీఆర్ ఎస్‌ను సొంతం చేసుకోవడమా? లేక చీల్చడమా? అనేదే తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి వాళ్లు రాష్ట్రానికి ఏం చేస్తారో.. ఓటర్లు ఆలోచించాలని సూచించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల సర్వేలను తాను నమ్మనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.