బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ...కాంగ్రెస్ వ్యూహమా ?

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాదు కానీ ఎక్కడ లేని రాజకీయం కనిపిస్తోంది. వారూ వీరూ బంధం కలుపుతున్నారు ప్రత్యర్ధులు మిత్రులు అవుతారని అంటున్నారు.;

Update: 2025-10-20 03:44 GMT

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాదు కానీ ఎక్కడ లేని రాజకీయం కనిపిస్తోంది. వారూ వీరూ బంధం కలుపుతున్నారు ప్రత్యర్ధులు మిత్రులు అవుతారని అంటున్నారు. రాజకీయాల్లో రెండూ రెండూ నాలుగు కావు. అలాగే ప్రతీ విమర్శ వెనుక ఎన్నో వ్యూహాలు ఉంటాయని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విషయంలో చేస్తున్న ఆరోపణల వెనక కూడా ఆలోచనలు ఏమై ఉంటాయన్నది చర్చగా ఉంది.

ఆ రెండూ మిలాఖత్ :

కాంగ్రెస్ ని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాదు ఏకంగా బీజేపీతో లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకుందని కూడా ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కి చెందిన ఓట్లను చీల్చేందుకే ఈ విధంగా బీఆర్ఎస్ ఎత్తులు వేస్తోందని ఆయన అంటున్నారు.

రహస్య ఒప్పందమేనా :

బీఆర్ఎస్ బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అది జూబ్లీ హిల్స్ కంటే ముందే ఉందని చెబుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లోనే మొదలైంది అంటున్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి చెందిన 21 శాతం ఓట్లను బీజేపీకి బీఆర్ఎస్ నుంచి బదిలీ అయిందని కూడా ఆయన ఆరోపించారు. అందువల్లనే వారు లబ్ది పొందారని చెప్పారు. ఇపుడు బీజేపీ పోటీ వెనక బీఆర్ఎస్ వ్యూహాలు ఉన్నాయని ఈ రెండు పార్టీలు కలసి కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు చూస్తున్నాయని అన్నారు. ఇపుడే కాదు 2028లో జరిగే ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయని కూడా ఆయన ముందస్తు జోస్యం చెబుతున్నారు రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని అంటున్నారు.

అందులో నిజమెంత :

బీఆర్ఎస్ బీజేపీ కలసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సహకరించుకుంటాయని రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలలో నిజమెంత అన్న చర్చ మొదలైంది. నిజానికి చూస్తే బీజేపీ పోటీ వల్ల కాంగ్రెస్ ఓట్లు ఎలా చీలుతాయని కూడా ఆలోచిస్తున్నారు. రెండు పార్టీల ఓటు బ్యాంక్ వేరుగా ఉంటుంది కదా అని అంటున్నారు. పైగా 2023 ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేశాయని గుర్తు చేస్తున్నారు అపుడు లేని ఇబ్బంది ఇపుడు ఎందుకు అన్నది కూడా అంటున్నారు.

అర్బన్ ఓటింగ్ లో :

అర్బన్ ఓటింగ్ విషయం తీసుకుంటే బీజేపీకి ఎక్కువగా ఉంటుంది. 2023 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో బీజేపీ పోటీ చేస్తే పాతిక వేల దాకా ఓట్లు వచ్చాయి. ఇది గుడ్ నంబర్ అని అంటున్నారు. అదే విధంగా ఇపుడు కూడా ఆ పార్టీ అంతే సంఖ్యలో ఓట్లు తెచ్చుకుంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య అర్బన్ ఓటింగ్ లో ఓట్లు చీలుతాయని ఆ మధ్యలో బీఆర్ఎస్ గెలుస్తుందని లెక్కలేవో కాంగ్రెస్ పెద్దల వద్ద ఉన్నాయా అన్నది చర్చ. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య పొత్తు అని లోపాయికారీ ఒప్పందం అని జనంలోకి సంకేతాలు పంపిస్తే ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటింగ్ మీద అది ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వేసిన ఎత్తుగడగా కూడా అంటున్నారు.

అయితే త్రిముఖ పోటీలో ఎపుడూ అధికార పక్షానికే లాభం ఉంటుంది. ఆ విధంగా చూస్తే బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీఆర్ఎస్ తో పంచుకున్నపుడు సహజంగా కాంగ్రెస్ కే కదా లాభిస్తుంది అన్న మాటా ఉంది. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి రాజకీయంగా వ్యూహాత్మకంగా చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. అంతే కాదు దీని మీద బీజేపీ బీఆర్ఎస్ ల రెస్పాన్స్ కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News