జూబ్లీహిల్స్ పోరు: ప్ర‌చారంలో వెనుక‌బ‌డ్డాం.. బీజేపీ అంత‌ర్మ‌థ‌నం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం చేసినా.. పెద్ద‌గా ఊపు రాలేద‌న్న చ‌ర్చ ఉంది. ముఖ్యంగా పార్టీ నాయ కులు ప్ర‌చారం చేప‌ట్టారు.;

Update: 2025-10-28 03:32 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం చేసినా.. పెద్ద‌గా ఊపు రాలేద‌న్న చ‌ర్చ ఉంది. ముఖ్యంగా పార్టీ నాయకులు ప్ర‌చారం చేప‌ట్టారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కూడా తొలి రెండు మూడు రోజులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. అంతేకాదు.. ఇంటింటికీ కూడా తిరిగారు. కానీ, త‌ర్వాత‌.. పార్టీఅధిష్టానం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్రచారంపై స‌మీక్ష చేసుకుంది. ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్ కంటే వెనుక‌బ‌డిన‌ట్టు గుర్తించింది. దీనిపై అంత‌ర్గ‌తంగా నాయ‌కుల‌తో స‌మీక్ష‌లు చేసింది. ఇలా అయితే.. పుంజుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన పార్టీ వెంట‌నే ప్ర‌త్యేక స్ట్రాట‌జీకి తెర‌దీసింది.

దీని ప్ర‌చారం వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు.. ఒక్క ఉదుట‌న నాయ‌కుల‌ను రంగంలోకి దింపుతుంది. అంటే.. నియోజ‌క‌వ‌ర్గం లో వాడ‌వాడ‌లా.. వీధివీధినా.. బీజేపీ నాయ‌కులే క‌నిపిస్తారు. అదేస‌మ‌యంలో ఇంటింటికీ తిరిగే వారు, ర‌హ‌దారుల‌పైన‌, బ‌స్టాప్‌ల‌లో ప్ర‌చారం చేసేవారు. ఇక‌, భారీ స‌భ‌లు పెట్టి ప్ర‌చారం చేసేవారు ప్ర‌త్యేకంగా ఉంటారు. దీనిని ఉత్త‌రాది రాష్ట్రాల్లోని యూపీ, ఢిల్లీలో బీజేపీ ప్ర‌యోగించింది. ఫ‌లితంగా సానుకూల ఫ‌లితం వ‌చ్చింది. అంటే.. ఈ ప్ర‌క్రియ‌లో.. అగ్ర‌నాయ‌కులు భారీ ప్ర‌సంగాల‌తో ఆక‌ట్టుకుంటారు. అదేస‌మ‌యంలో ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఇంటింటికీ తిరుగుతారు. కార్య‌క‌ర్త‌లు.. ప్ర‌చార ప‌త్రాల‌ను పంచుతారు. కూడ‌ళ్ల‌లో చ‌ర్చ పెడ‌తారు.

ఇవ‌న్నీ..ఒకే స‌మ‌యంలో జ‌రుగుతాయి. ఫ‌లితంగా.. పెద్ద ఎత్తున ప్ర‌చారం ల‌భిస్తుంది. ఇలా.. జూబ్లీహిల్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని బీజేపీ అధిష్టానం నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కీల‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో పెద్ద నాయ‌కులు అక్క‌డే తిష్ఠ‌వేశారు. దీంతో రాజ‌స్థాన్ స‌హా.. ఇత‌ర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఒక‌రిద్ద‌రు ముఖ్య‌మంత్రులు రానున్నారు. అలాగే.. ఆయా రాష్ట్రాల్లోని కీల‌క నాయ‌కులు కూడా హైద‌రాబాద్‌కు చేరుకుంటారు. వీరంతా ఒకేసారి రంగంలోకి దిగి.. జూబ్లీహిల్స్‌ను కాషాయ‌మయం చేయ‌నున్నారు. ఇలా.. నాలుగు రోజుల పాటు ప్ర‌చారం చేయ‌డం ద్వారా.. వెనుక‌బ‌డ్డామ‌న్న అప‌ప్ర‌ద‌ను తుడుచుకునే ప్ర‌య‌త్నంలో క‌మ‌ల నాథులు ఉన్నారు.

ఏం జ‌రుగుతుంది?

ఒకేసారి భారీ ప్ర‌చారం చేసినా.. ద‌ఫ‌ద‌ఫాలుగా చేసినా.. ప్ర‌చారం క‌న్నా.. ప్ర‌జ‌ల నాడి ముఖ్యం. ఈ విష‌యంలో జూబ్లీహిల్స్ ఓట‌రు నాడి ఎలా ఉంద‌న్న‌ది కీల‌కం. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ -కాంగ్రెస్‌ల మ‌ధ్యే ప్ర‌ధాన పోరు కొన‌సాగుతోంద‌న్న చ‌ర్చ ఉంది. ఈ క్ర‌మంలో బీజేపీ దూకుడు పెంచినా.. ఈ పోరు స్వ‌ల్పంగా త‌గ్గుతుంద‌న్న వాద‌నే ఉంది త‌ప్ప‌..ఏక‌ప‌క్షంగా మార్పు రాద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. అయితే.. బీజేపీకి ఇది అడ్వాంటేజ్ కానుంద‌ని అంటున్నారు. కీల‌క‌నాయ‌కులు రావ‌డంతో బీజేపీ ప్రాభ‌వం పెరుగుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News