తటస్థ ఓటర్లే జూబ్లీ ఫలితాన్ని డిసైడ్ చేసేది!
సాధారణంగా ఎన్నికలు ఏవైనా.. తటస్థ ఓటర్లు ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉంటారు. ఎన్నికల ఫలితాల్ని వీరు డిసైడ్ చేయలేరు.;
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఆసక్తికర చర్చ ఒకటి ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తోంది. జూబ్లీహిల్స్ లోని 4 లక్షల ఓటర్లలో ఎంత మంది పోలింగ్ రోజున ఓట్లు వేసేందుకు వస్తారు? వీరిలో ఏ వర్గానికి ఎంత వాటా ఉందన్నది ఒక చర్చ అయితే.. పార్టీల పరంగా కాకుండా తటస్థంగా ఉండే ఓటర్లు వేసే ఓటే.. జూబ్లీహిల్స్ విజేతను డిసైడ్ చేస్తారని అంటున్నారు. అదెలా అంటే.. దానికి అసలు కారణం ఒకటుంది.
సాధారణంగా ఎన్నికలు ఏవైనా.. తటస్థ ఓటర్లు ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉంటారు. ఎన్నికల ఫలితాల్ని వీరు డిసైడ్ చేయలేరు. కానీ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా తటస్థ ఓట్లు 16 శాతం ఉన్నట్లుగా సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అంటే.. వంద మంది ఓటు వేస్తే.. వారిలో 16 మంది తాము ఎవరికి ఓటు వేసే విషయాన్ని పోలింగ్ రోజున డిసైడ్ అయ్యే వీలుందంటున్నారు.
ఇప్పటికే హోరాహోరీగా.. నువ్వా నేనా? అన్న రీతిలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్.. బీఆర్ఎస్ లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న వేళ.. మెజార్టీ చాలా తక్కువగా వచ్చే వీలుంది. ఇలాంటి వేళలో.. పార్టీలకు అతీతంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే తటస్థ ఓటర్లు 16 శాతం ఉండటంతో.. వారి ఓటే కీలకంగా మారనుంది. వారు ఎటువైపు మొగ్గితే విజయం వారి పక్షాన నిలుస్తుందని చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే జూబ్లీహిల్స్ ఉపపోరులో మొత్తం ఆరు డివిజన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ఎవరికి వారు తమకు పట్టున్న డివిజన్ల లెక్క వారు చెబుతున్నారు. మెజార్టీ డివిజన్లలో తమకే పట్టు ఉందంటూ పోటాపోటీగా లెక్కలు చెబుతున్న నేపథ్యంలో.. ఉప ఎన్నికల ఫలితాలే నిజమేమిటన్నది డిసైడ్ చేస్తారని చెప్పాలి. అందుకు మరో వారం వెయిట్ చేయక తప్పదు.