జూబ్లీహిల్స్ గెలిస్తేనే.. రేవంత్ రెడ్డి జాతకం ఏం చెబుతోంది?
వచ్చేనెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో అధికార పార్టీకి సవాల్ గా మారింది.;
వచ్చేనెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో అధికార పార్టీకి సవాల్ గా మారింది. రెండేళ్ల క్రితం అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తాజా ఉప ఎన్నిక రిఫరెండంగానే చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ సిటింగు సీటు కాకపోయినప్పటికీ, అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో ప్రభుత్వ పనితీరుకు ఇది పరీక్షగానే చెబుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠకు ఈ ఎన్నిక ఒక అగ్ని పరీక్షగా వ్యాఖ్యానిస్తున్నారు.
2023 నవంబరు 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఆరు నెలలకు పార్లమెంటు ఎన్నికల జరిగితే అధికార కాంగ్రెస్ 8 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని గౌరవం దక్కించుకుంది. ఇక మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు జరగాల్సివున్నా, రకరకాల కారణాలతో ఇప్పటివరకు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం, నేరుగా ప్రజల తీర్పు ఇవ్వనుండటం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు పరీక్షగానే భావిస్తున్నారు.
2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా హైదరాబాదులో ఆక్రమణల తొలగింపునకు ఆయన ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వ్యవస్థ హైడ్రా. దీనిపై రకరకాల విమర్శలు, ప్రశంసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఇంతవరకు స్పష్టం కాలేదు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా మిశ్రమ స్పందనే ఉంది. ఇక రేషన్ కార్డుల పంపిణీ, గృహ నిర్మాణాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలపై ఇప్పటివరకు ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది. వీటిన్నటికీ జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక జవాబు చెబుతుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవనే టాక్ వినిపిస్తుంది. చాలాకాలం తర్వాత కాంగ్రెస్ సంస్కృతిని చూస్తున్న ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నారని కూడా అంటున్నారు. మంత్రులు కూడా బహిరంగంగా కీచులాడుకోవడం విమర్శలకు కారణమవుతోంది. ఈ పరిస్థితులలో ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది ఆసక్తిరేపుతోంది. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయా? లేదా? అన్న చర్చ నడుమ జరగనున్న ఈ ఎన్నిక ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమతం మేరకు అభ్యర్థి ఎంపిక జరిగింది. దీంతో వ్యక్తిగతంగా కూడా ఇక్కడ గెలుపు సీఎం రేవంత్ ప్రతిష్టకు పరీక్షగానే చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో గెలిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చునని అంటున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు కీచులాటలకు దిగుతున్న మంత్రులు, ఇతర నేతలు కూడా సైలెంటు అవ్వాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా ప్రజామోదం లభించినట్లు అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా హైడ్రా మరింత దూకుడుగా పనిచేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. లేనిపక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ పునఃసమీక్షించుకోవాల్సి వుంటుందని అంటున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డి జాతకాన్ని మార్చేదిగా వ్యాఖ్యానిస్తున్నారు.