జూబ్లిహిల్స్ పోరులో ఎంత‌మంది ఉన్నా... ఆ ఇద్ద‌రి మ‌ధ్యే పోటీ...?

Update: 2025-10-26 03:15 GMT

తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పుడు అందరూ ప్రచారం మీద దృష్టి సారిస్తున్నారు. మొత్తం 81 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో చాలా నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. ఎంత‌మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినా ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అటు బిజెపి అభ్యర్థుల మధ్య ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వాస్తవంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది పోటీ ఎవరెవరి మధ్య ఉంది ? అన్నది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వాస్తవ పోటీ మాత్రం బిఆర్ఎస్ - కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఉంటుందని క్లియర్ గా తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు. ఇక్కడి నుంచి గత మూడు ఎన్నికలలో దివంగత మాగంటి గోపీనాథ్ వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 2014లో తెలుగుదేశం నుంచి తొలిసారిగా ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రెండు ఎన్నికలలోను గులాబీ పార్టీ గుర్తు మీద విజయం సాధించారు. ఇప్పుడు ఉప ఎన్నికలలో సానుభూతి కోసం గులాబీ పార్టీ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను పోటీ చేయిస్తుంది. ఈ విషయంలో కొందరు నేత‌లు రేసులో ఉన్నా గులాబీ అధినేత ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక‌ను తమకు వచ్చిన మరో మంచి అవకాశం గా చూస్తోంది. సాధారణ ఎన్నికల తర్వాత ఆరు నెలలకే కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. అది కూడా బిఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్‌ సీటు. మరోసారి బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు అయిన జూబ్లీహిల్స్ ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు సకల అస్త్ర శాస్త్రాలు వాడుతుంది.

ఈ సారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న మ‌జ్లిస్ పార్టీ మ‌ద్ద‌తు కూడా కాంగ్రెస్‌కు తోడైంది. దీనికి తోడు న‌వీన్ యాద‌వ్ వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మా, రేవంత్ రెడ్డి గ‌ట్టి ఫోక‌స్ పెట్ట‌డం ఇవ‌న్నీ కాంగ్రెస్‌కు ప్ల‌స్‌గా మారాయి. ఇక కేసీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగ‌డం, కేటీఆర్‌, హ‌రీష్‌రావు ఇక్క‌డ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌లుగా ఉండ‌డం బీఆర్ఎస్‌కు క‌లిసి రానుంది. అయితే బీజేపీ ఈ ఉప ఎన్నిక‌ను ముందు నుంచి ఏ మాత్రం సీరియ‌స్‌గా తీసుకోలేద‌ని తెలుస్తోంది. అస‌లు అభ్య‌ర్థిని సైతం చాలా ఆల‌స్యంగా ఖ‌రారు చేసింది. మైనార్టీ ఓట్ల సెంట్ర‌లైజేష‌న్ కూడా బీజేపీకి మైన‌స్‌. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన దీప‌క్ రెడ్డికి సీటు ఇచ్చినా.. ఆయ‌న అంత ఆస‌క్తితో ఉన్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. ఏదేమైనా జూబ్లిహిల్స్ పోరు కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ మ‌ధ్యే అన్న‌ది సుస్ప‌ష్టం.

Tags:    

Similar News