బీజేపీ మాధవీలతకు జూబ్లీహిల్స్ లో ఎదురీత
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు మాధవీ లత నిర్వహించిన ఇంటింటి ప్రచారం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది.;
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు మాధవీ లత నిర్వహించిన ఇంటింటి ప్రచారం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీ అభ్యర్థి లంకలపల్లి దీపక్ రెడ్డికి మద్దతు కూడగట్టేందుకు మాధవీలత తీవ్రంగా శ్రమిస్తుండగా, ఓటర్లు ఆమెను చుట్టుముట్టి పదేపదే ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆమె తికమకపడ్డారు.
'మాకు ఏం చేశారు?' అంటూ ప్రశ్నల వాన:
ప్రచారంలో భాగంగా మహిళలు, వృద్ధులు, యువతను కలుస్తూ పాంప్లెట్‌లు పంచుతున్న మాధవీలతను స్థానిక ఓటర్లు నేరుగా నిలదీశారు. "మాకు మీరు ఏం చేశారు?" అని ప్రశ్నించగా, ఆమె కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులు, పెట్టుబడుల గురించి వివరించారు. అయితే, ప్రజలు వెంటనే స్పందిస్తూ" అవి కేసీఆర్, రేవంత్ రెడ్డి తెచ్చారే, మీరు ఏం చేశారు?" అంటూ బీజేపీని ఉద్దేశించి గుచ్చి మరీ అడిగారు. ఈ అనూహ్య స్పందనతో మాధవీలత కొంత ఇబ్బందికి గురయ్యారు.
కారు గుర్తు గందరగోళం
గత ఎన్నికల ప్రస్తావన తెచ్చిన కొంతమంది మహిళలు "గత ఎన్నికల్లో మీకు మేమే ఓటేశాం.. అయినా ఓడిపోయారు కదా!" అని చెప్పడంతో మాధవీలత ఆశ్చర్యంతో "ఏ గుర్తుకి ఓటేశారో?" అని ప్రశ్నించారు. అందుకు వారు "కారు గుర్తుకే!" అని సమాధానం ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. "మా గుర్తు అది కాదు" అని ఆమె వివరించినా వృద్ధులు "మాకు తెలిసింది కారు గుర్తే" అని చెప్పడంతో మాధవీలత వారిని సముదాయించలేకపోయారు. బీజేపీకి, బీఆర్ఎస్‌కు మధ్య 'కారు' గుర్తుపై ఉన్న ఈ అయోమయం స్థానికంగా ఇంకా కొనసాగుతోందని ఈ సంఘటన స్పష్టం చేసింది.
*'మోడీ డబ్బులు ఎక్కడ?' అంటూ యువత నిలదీత
అదే సమయంలో ప్రచారంలో పాల్గొన్న యువత కూడా మాధవీలతను నిలదీశారు. "మోడీ గారు వచ్చాక మా అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పారు, ఆ డబ్బులు ఎక్కడ?" అని ప్రశ్నించారు. వివిధ పథకాల కింద నిధులు వస్తున్నాయని ఆమె సమాధానం ఇచ్చినా "మాకు రావడం లేదు" అని యువత చెప్పడంతో మాధవీలత అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తుండగా "మీరు వస్తే ఏం చేస్తారు?" అని స్థానికులు ప్రశ్నించారు. దీనికి ఆమె "త్వరలో చెబుతాం" అని చెప్పి తటపటాయించడంపై కొందరు అసహనం వ్యక్తం చేశారు.
పార్టీ కార్యాలయంలో చర్చ
ప్రజల నుంచి ఎదురైన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయిన మాధవీలత, ప్రచారం ముగించుకుని తిరిగి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలతో చర్చించారు. "ప్రజల ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలో చెప్పండి" అని ఆమె పార్టీ నాయకత్వాన్ని అడిగినట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఓటర్లు బీజేపీపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు ముఖ్యంగా స్థానిక అభివృద్ధిపై బీజేపీ నుంచి స్పష్టమైన హామీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ అనూహ్య అసంతృప్తిని రాబోయే రోజుల్లో బీజేపీ నాయకత్వం ఎలా అధిగమిస్తుందో, ఉప ఎన్నికల రాజకీయ సన్నివేశం ఎంత ఉత్కంఠ భరితంగా మారుతుందో చూడాలి.