జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయం !

తెలుగు నాట సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో రాణించేది ఎవరు అంటే అంతా ఠక్కున చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్.

Update: 2026-05-19 16:30 GMT

తెలుగు నాట సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో రాణించేది ఎవరు అంటే అంతా ఠక్కున చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ కి మనవడు. నందమూరి వారి వంశంలో మూడవ తరం వారసుడు. నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే ఆయన సినీ సీమలోకి అడుగు పెట్టి 18 ఏళ్ళలో ఆది తో సూపర్ హిట్ కొట్టాడు. 20 ఏళ్ళకే సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతే కాదు ఆయనకు మంచి వక్తగా పేరుంది. తాను అనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పగల సామర్థ్యం ఆయనలో ఉంది. అందుకే కోలీవుడ్ లో సినీ నటుడు విజయ్ సీఎం కాగానే అందరి చూపూ టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ మీద పడింది.

వైసీపీ మాజీ నేత జోస్యం :

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యలే చేశారు. తాత సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా ఆహార్యంతో పాటు మంచి ఉపన్యాసం ఇచ్చే నేర్పు జూనియర్ కి ఉందని కితాబు ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా ఉంటారు కాబట్టే ఆయన అంటే ఇష్టం అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.

ప్రజలలో మంచి అభిప్రాయం :

జూనియర్ ఎన్టీఆర్ కి సమర్ధత ఉందని, ప్రజలలో కూడా ఆయన పట్ల మంచి అభిప్రాయం ఉందని శ్రీనివాస్ చెప్పారు. రాజకీయాల్లో ఎవరికి ఎలాంటి చాన్స్ దక్కుతుందన్నది చెప్పలేమని అయితే జూనియర్ కి మాత్రం అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. విజయ్ కూడా తమిళనాడులో ఓవర్ నైట్ సీఎం కాలేదని దువ్వాడ చెప్పారు. ఆయన విద్యార్ధులకు పేదలకు అణగారిన వర్గాలకు తన అభిమానుల ద్వారా ఎంతో సేవ చేశారని అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. విజయ్ పేరుతో చాలా మంది పోటీ చేసి స్థానిక ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచారని అన్నారు. చాప కింద నీరు మాదిరిగా విజయ్ పనిచేస్తూనే ఒక్కసారి తమిళ రాజకీయాల్లో బ్లాస్ట్ చేశారని అన్నారు. నిజానికి తమిళనాడులో సినీ హీరోలు రాజకీయాల్లోకి రావడం అన్నది చాలా సహజం అని అన్నారు. ఆరు దశాబ్దాలుగా వారే పాలిస్తున్నారు అని గుర్తు చేశారు.

ఏపీలో సినీ నటులు ఫెయిల్ :

విజయ్ తమిళనాడులో ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చారని అన్నారు. అంతే కాకుండా ఆయన పట్ల జనాభిమానం కూడా అలా కనిపించింది అన్నారు. ఎన్నో ఇబ్బందులను విజయ్ ఎదుర్కొని ముందుకు వచ్చారని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చినా ఫెయిల్ అయ్యారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఏపీలో చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఇబ్బందులు తట్టుకోగలుగుతారా అన్న ప్రశ్నకు దువ్వాడ బదులిస్తూ ఆయనకు గతంలోనే రాజకీయ అనుభవం ఉందని అన్నారు. ఆయనకు అవన్నీ అలవాటే అని తాను భావిస్తున్నాను అన్నారు. గతంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ప్రచారం చేశారని 2009 నాటి విషయాలను చెప్పారు. ఆయనకు అవకాశాలు రావచ్చు అంటూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తున్నాయి. మరి ఈ విషయంలో రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంది. ఇంతకీ జూనియర్ మనసులో రాజకీయాల గురించి ఏముంది అన్నదే పెద్ద ప్రశ్న అంటున్నారు.

Tags:    

Similar News