చచ్చేవరకూ పవన్ వెంటే...జోగయ్య పెద్ద ఒట్టు...!

ఇక పవన్ కి అనుభవం లేని వారు సలహాలు ఇస్తున్నారు అని కూడా జోగయ్య తన సహజ శైలిలో కామెంట్స్ చేశారు.

Update: 2024-03-02 13:58 GMT

తాను చచ్చేంతవరకూ జనసేనతోనే ఉంటాను అని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అతి పెద్ద ఒట్టు వేశారు. తనను పవన్ ని ఎవరూ విడదీయలేరు అని కూడా అన్నారు. తాను పవన్ ని అధికారంలో చూడాలని అనుకుంటున్నాను అని ఆయన స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంతవరకూ తమ పోరాటం ఆగేది లేదు అని తేల్చేశారు.

ఈ కురు వృద్ధుడు ఇంతలా శపధం పట్టడానికి స్ట్రాంగ్ కమిట్ మెంట్ తో స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్స్ ఉన్నాయని అంటున్నారు. నిన్నటికి నిన్న ఆయన కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ వెళ్ళి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ సమక్షంలోనే ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ పోకడల మీద ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

తన తండ్రిని అవసరం కోసం పవన్ వాడుకున్నారని ఇపుడు పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేకీయ పార్టీ పెట్టాక ఎవరి సలహాలు వద్దు అని అనడమేంటి అని విమర్శించారు. పవన్ పార్టీని నడపలేరని మూసుకోవాల్సిందే అని కూడా సూచించారు. మొత్తానికి కుమారుడి దెబ్బ అయితే జోగయ్య మీద బాగా పడింది.

జోగయ్య కుమారుడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో జోగయ్య మీద కూడా జనసైనికులు మండిపోయారు. ఆయన వైసీపీ కోవర్ట్ అని ట్రోల్ చేస్తున్నారు. కొందరు అయితే మీడియా మీటింగులు పెట్టి మరీ జోగయ్య వైఖరిని ఎండగట్టారు. నిజానికి చూస్తే జోగయ్య కుమారుడికి అసెంబ్లీ టికెట్ పొత్తులో దక్కేలేదు అన్న మాట కూడా ఉందిట.

Read more!

ఇవన్నీ చూసిన వారు జోగయ్య అంకితభావాన్ని శంకించడం మొదలెట్టారు. అయితే కుమారుడి రాజకీయ పంధాతో సంబంధంలేదని చెబుతూ జోగయ్య ఈ కీలక ప్రకటన చేశారు అని అంటున్నారు. తాను పవన్ కోసమే ఉన్నానని చెప్పుకున్నారు. పవన్ కి అధికారం దక్కాలన్నది తన కోరిక అన్నారు.

ఇక పవన్ కి అనుభవం లేని వారు సలహాలు ఇస్తున్నారు అని కూడా జోగయ్య తన సహజ శైలిలో కామెంట్స్ చేశారు. అందుకే గత ఎన్నికల్లో పవన్ ఓటమి పాలు అయ్యారు అని ఆయన ఆరోపించారు. ఇక తన చర్యలను తన ప్రకటనలను కొందరు తప్పు పడుతున్నారని పెద్దాయన మండిపడ్డారు.

ఎవరు ఏమి అనుకున్నా కూడా తాను తన దారిలో పనిచేసుకుంటూ వెళ్తాను అని ఆయన అంటున్నారు. పవన్ వెంట పవన్ తోనే తన ప్రయాణం అని జోగయ్య స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జోగయ్య 1970 నుంచి రాజకీయాలను స్టార్ట్ చేశారు. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన కాంగ్రెస్ టీడీపీ మళ్ళీ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ ఆ తరువాత ప్రజారాజ్యం, మళ్ళీ అక్కడ నుంచి వైసీపీ దాని నుంచి ఆయన జనసేన ఇలా పార్టీలు మారుతూ వచ్చారు.

అయితే కాపులకు రాజ్యాధికారం దక్కాలన్న జోగయ్య ఆకాంక్షను ఆయన కమిట్మెంట్ ని ఎవరూ తప్పు పట్టాల్సిన పని లేనే లేదు. ఆయన దాని కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఆయన నాడు చిరంజీవికి నేడు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వడం వెనక కాపుల చిరకాల ఆకాంక్ష ఉందని అంటున్నారు.

ఇక ఆయన వయసు ప్రస్తుతం 87 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన రాజకీయంగా చురుకుగా ఉంటూ ఎప్పటికపుడు అప్టూ డేట్ గా ఉంటూ లేఖలు సంధించడం మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ముచ్చట గొలిపే విషయమే. మరి జోగయ్య తాను పవన్ పక్షం అని అంటున్నారు. పవన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో. ఆయన సలహాదారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారు అంటున్న జోగయ్య కామెంట్స్ మీద ఏమంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News