భారత్ కు గుడ్ న్యూస్ : 2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే..?

అమెరికా రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుండగానే.. అప్పుడే 2028 అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ మొదలైంది.;

Update: 2026-03-29 23:30 GMT

అమెరికా రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుండగానే.. అప్పుడే 2028 అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ వారసుడు ఎవరనే ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం అగ్రరాజ్యం అమెరికాతో అత్యంత సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్న భారత్‌కు ఒక శుభసూచికగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సీపాక్ సర్వేలో దూసుకుపోతున్న వాన్స్

ఇటీవల నిర్వహించిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపాక్) స్ట్రా పోల్ ఫలితాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. 2028లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు అత్యధికంగా 53 శాతం మంది జేడీ వాన్స్ వైపు మొగ్గు చూపారు. ఈ రేసులో మార్కో రూబియో (35%) రెండో స్థానంలో నిలవగా రాన్ డిశాంటిస్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ వంటి వారు కూడా జాబితాలో ఉన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండగలరు కాబట్టి 2028లో ట్రంప్ పోటీ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ 'మాగా' (మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ ) సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లగల సమర్థుడైన నాయకుడిగా వాన్స్ నిలిచారు.

భారత్‌కు ఎందుకు అనుకూలం?

జేడీ వాన్స్ అభ్యర్థిత్వం భారత్‌కు పలు అంశాల్లో ప్రయోజనకరంగా మారుతుందని భావిస్తున్నారు. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో భారత్ అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వామి అని వాన్స్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ పాత్రకు ఆయన పెద్దపీట వేస్తున్నారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. ఆమె పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఇటీవల ఈ దంపతులు భారత్‌లో పర్యటించి తమ మూలాలను సందర్శించడం ఇరు దేశాల మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని చాటిచెప్పింది. ట్రంప్ మాదిరిగానే వాన్స్ కూడా 'అమెరికా ఫస్ట్' విధానాన్ని అనుసరించినప్పటికీ సాంకేతికత, రక్షణ రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేయడానికి ఆయన మొగ్గు చూపుతున్నారు. "భారత్ కేవలం ఒక మిత్రదేశం మాత్రమే కాదు, 21వ శతాబ్దపు భౌగోళిక రాజకీయాల్లో అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి." అని రాజకీయ విశ్లేషకుల అంచనాగా చెబుతున్నారు. జేడీ వాన్స్ ఇదే చెబుతున్నారు.

సవాళ్లు.. అంతర్జాతీయ పరిణామాలు

ప్రస్తుతం ట్రంప్ హయాంలో జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ప్రయత్నాలు, ఇరాన్ ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ సంక్షోభం వంటివి 2028 నాటికి అమెరికా విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అమెరికాలో పెరుగుతున్న 'నో కింగ్స్' వంటి నిరసన ఉద్యమాలు అంతర్గత సవాళ్లుగా మారినప్పటికీ, వాన్స్ తన వాగ్ధాటితో రిపబ్లికన్ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

మొత్తంమీద 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ జేడీ వాన్స్ పేరు తెరపైకి రావడం అంతర్జాతీయంగా ముఖ్యంగా భారత్‌లో ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తోంది. ఒకవేళ వాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైతే వైట్ హౌస్‌లో 'భారత అల్లుడు' అడుగుపెట్టినట్లవుతుంది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.

Tags:    

Similar News