వంశీ బ్యాడ్ లక్ ని జనసేన మార్చేస్తుందా...!?

నిజానికి చూస్తే ఆయనకు మరో అయిదేళ్ల పాటు పెద్దల సభలో అవకాశం ఉంది. 2028 దాకా శాసనమండలిలో మెంబర్ గా ఉండవచ్చు.

Update: 2023-12-29 10:30 GMT

వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ జనసేనలోకి మారిపోయారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని 2024లో పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని భావించే పార్టీ మారాను అని చెప్పుకున్నారు. వైసీపీలో పోటీ చేసే వాతావరణం లేదు కాబట్టి ఇలా చేశాను అని కూడా అన్నారు.

నిజానికి చూస్తే ఆయనకు మరో అయిదేళ్ల పాటు పెద్దల సభలో అవకాశం ఉంది. 2028 దాకా శాసనమండలిలో మెంబర్ గా ఉండవచ్చు. కానీ దాన్ని కూడా కాదనుకుని ఆయన ఎమ్మెల్యేగా పోటీకి వస్తున్నారు అంటే ఆయనలో ఎమ్మెల్యే అనిపించుకోవాలన్న కోరిక ఎంతలా ఉందో అని అంటున్నారు.

ఇక వంశీ విశాఖలో 2009లో తూర్పు నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ నుంచి వంశీ పోటీ చేశారు. చిరంజీవి మానియా కూడా వంశీని విజయతీరాలకు చేర్చలేకపోయింది. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మళ్లీ విశాఖ తూర్పు నుంచే పోటీ చేశారు. ఈసారి 47 వేల భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు.

అదే ఆయన పొలిటికల్ కెరీర్ ని దెబ్బేసింది. తక్కువ తేడాతో ఓడితే 2019లో సీటు దక్కేది. అలా జరగడంతో ఆయనకు 2019లో సీటు రాలేదు. దాంతో ఆయన అప్ సెట్ అయ్యారు. మొత్తానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు. అయినా సరే వంశీ హ్యాపీగా ఉండలేకపోయారు.

ఎలాగైనా 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. విశాఖ తూర్పు టికెట్ తనకు దక్కుతుందని ఆశపడ్డారు. అనూహ్యంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తూర్పు నుంచి పోటీకి దిగారు. దాంతో వంశీకి చోటు దక్కలేదు. దాంతో పాటు గాజువాక నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన చందుని ఇంచార్జిని వైసీపీ చేసింది. దాంతో వంశీకి ఏ విధంగానూ అవకాశం వైసీపీలో లేకుండా పోయింది.

దాంతో ఆయన జనసేనలోకి మారారు. మరి పవన్ ఆయనకు ఏ హామీ ఇచ్చారో తెలియదు అంటున్నారు. ఎందుకంటే విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామక్రిష్ణ బాబుని తప్పించడం కష్టం. ఆయన ఇప్పటికే ప్రచారం మొదలెట్టేశారు. దాంతో సిటీలో ఎక్కడైనా పోటీకి రెడీ అని వంశీ అంటున్నారు. కానీ జనసేనకు టీడీపీ ఇచ్చే సీట్లు ఎన్ని అందులో వంశీకి ఎక్కడ అకామిడేట్ చేస్తారు అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ గా ఉంది అంటున్నారు.

దాంతో వంశీకి టికెట్ దక్కుతుందా అన్నది ఒక ప్రశ్న అయితే దక్కినా గెలుస్తారా అన్నది మరో ప్రశ్న. దానికి కారణం ఆయనకు తూర్పులోనే బలం ఉంది. అది కాకుండా వేరే చోట టికెట్ ఇస్తే నాన్ లోకల్ అవుతారు. తక్కువ టైం లో అక్కడ జనాలను మంచి చేసుకుని ప్రత్యర్ధి పార్టీని ఢీ కొట్టి గెలవడం అంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. దాంతో పాటు వంశీ లక్ కూడా ఫేవర్ చేయాలి.

నిజం చెప్పాలంటే వంశీకి మొదటి నుంచి బ్యాడ్ లక్ ఇబ్బంది పెడుతోంది అని అనుచరులు అంటున్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. కానీ వంశీకి ఆ లక్ దక్కడంలేదు. ఇపుడు జనసేన అయినా ఆయన జాతకాన్ని మారుస్తుందా అన్నది పెద్ద చర్చగా ఉందిట.

Tags:    

Similar News