ఎనిమిది సీట్లకు జనసేన ఓకేనా ?

మొత్తానికి తెలంగాణాలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరినట్లే ఉంది.;

Update: 2023-11-05 04:25 GMT

మొత్తానికి తెలంగాణాలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరినట్లే ఉంది. ఎనిమిది నియోజకవర్గాలు కేటాయించటానికి బీజేపీ అంగీకరించింది. జనసేన ఒంటరిగానే 32 సీట్లకు పోటీచేయటానికి సిద్ధపడింది. అయితే తర్వాత బీజేపీతో పొత్తు కుదరటంతో కనీసం 20 సీట్లయినా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. అయితే రెండుపార్టీల మధ్య జరిగిన చర్చల్లో జనసేనకు 8 సీట్లు ఇస్తున్నట్లు బీజేపీ అధికారికంగా ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమంటారన్నది సస్పెన్సుగా మారింది.

ఒకవేళ పవన్ ఓకే అంటే అప్పుడు అధికారికంగా సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను మీడియాకు ప్రకటిస్తారు. అయితే పార్టీవర్గాల ప్రకారం ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, కోదాడ, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు నియోజకవర్గాలను జనసేనకు కేటాయించబోతున్నట్లు తెలిసింది. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాలున్నాయి. రెండు సీట్లు మల్కాజ్ గిరి, కూకట్ పల్లి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివి. కోదాడ నల్గొండ జిల్లాలో ఉండగా నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలోనిది.

బీజేపీ ఆలోచన చూస్తుంటే జనసేన సీమాంధ్ర పార్టీ కాబట్టి సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించినట్లు కనిపిస్తోంది. ఇక కోదాడ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోదే అయినా ఈ నియోజకవర్గం కూడా సీమాంధ్ర సరిహద్దుల్లోనే ఉంది. ఒక్క నాగర్ కర్నూలు నియోజకవర్గం మాత్రమే మహబూబ్ నగర్ జిల్లాలోనిది. దీనిమీద కూడా కొంత కర్నూలు జిల్లా ప్రభావం ఉందని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు లేకపోతే లేదు.

మొత్తానికి ఈ ఎనిమిది నియోజకవర్గాలను కేటాయించటానికి బీజేపీ మిత్రపక్షం జనసేనను ముప్పుతిప్పలు పెట్టింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనా పొత్తులో నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాలు ఫైనల్ చేయలేదంటేనే ఎంత ఇబ్బందులు పెట్టిందో అర్ధమైపోతోంది. నిజానికి రెండుపార్టీల బలం అంతంతమాత్రంగానే ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తనకేదో బ్రహ్మాండమైన బలముందని బీజేపీ బిల్డప్ ఇస్తుండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి చివరకు వీళ్ళ పొత్తులో ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News