ఒంటరి పోరు జనసేనకు టఫ్ టాస్క్ !

ఇక్కడ ఉన్న పార్టీలకు తోడు కొత్తగా రేసులోకి దూసుకుని వచ్చేందుకు జనసేన వంటి పార్టీలు కూడా చూస్తున్నాయి.

Update: 2026-06-03 11:30 GMT

జనసేన ఏపీ రాజకీయాల్లో కూటమి కట్టింది. ఒక బలమైన క్షేత్ర స్థాయిలో అపారమైన క్యాడర్ కలిగిన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అలాగే జాతీయ స్థాయిలో మరో బలమైన బీజేపీతోనూ జత కలసింది. దాని వల్లనే 2024 ఎన్నికల్లో మూడు పార్టీలూ కలసి అద్భుతమైన ఫలితాన్ని అందుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 164 దాకా కూటమి గెలుచుకుంది. ఇక ఏపీలో చూస్తే రాజకీయం ముఖా ముఖీ పోరుగా ఎపుడూ ఉంటూ వస్తోంది. గతంలో అయితే కాంగ్రెస్ టీడీపీ ఇపుడు చూస్తే వైసీపీ టీడీపీ ప్లస్ మిత్రులు ఇలా బాహా బాహీగా రాజకీయ వాతావరణం ఉంది. కానీ తెలంగాణాకు వచ్చేసరికి మాత్రం బహు ముఖ పోరు ఎపుడూ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పార్టీలకు తోడు కొత్తగా రేసులోకి దూసుకుని వచ్చేందుకు జనసేన వంటి పార్టీలు కూడా చూస్తున్నాయి.

ప్రధాన పార్టీల మధ్యన :

తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ బీఆర్ ఎస్ రెండూ అధికారం లోకి సింగిల్ గా వచ్చిన పార్టీలు. ఈ రెండింటికీ సొంత బలం బలగం ఉన్నాయి. అలాగే విశేషమైన ఓటు షేర్ కూడా ఉంది. ఈ పాటీల తరవాత చెప్పుకోవాలీ అంటే బీజేపీ ఉంది. ఆ పార్టీ కూడా ఇటీవల వరసగా జరిగిన ఎన్నికల్లో తన ఓటు షేర్ ని పెంచుకుంటూ పోతోంది.2023 ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను 2024 ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ గెలుచుకుంది. ఇక బీజేపీ మరింతగా విస్తరించాలని చూస్తోంది. అదే సమయంలో తెలంగాణాలో కొత్త పార్టీలు కూడా రంగ ప్రవేశం చేస్తున్నాయి.

కవిత టీఆర్ఎస్ తో :

తెలంగాణా రక్షణ సేన టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె 2028 ఎన్నికల్లో తమ పార్టీ జాతకాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ వస్తునారు. మరో వైపు చూస్తే జనసేన్ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో పోటీ చేసి తీరుతామని ప్రెస్ మీట్ లో చాలా స్టాంగ్ గా చెప్పారు. దాంతో పవన్ రాజకీయం కూడా తెలంగాణాలో సీరియస్ గానే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడం విశేషం. ఏపీలో టీడీపీ బీజేపీతో పొత్తు ఉన్నా తెలంగాణాలో మాత్రం సొంతంగానే అని పవన్ అంటున్నారు.

సక్సెస్ రేటు ఎంత :

ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణాలో పోటీ సొంతంగానే చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. తమ పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ నేతలు తరచూ చెబుతున్నారు. దాంతో జనసేన కూడా ఒంటరిగానే వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఒంటరి పోరు జనసేనకు ఏ మేరకు కలసి వస్తుంది అన్నదే ఇక్కడ పశ్న. ఇప్పటికీ జనసేన సంస్థాగతంగా తెలంగాణాలో పెద్దగా బలపడలేదు. పవన్ ని అభిమానించే వారు అనుచరులుగా ఉన్న వారే కనిపిస్తున్నారు. నియోజకవర్గం స్థాయి నేతలు అవసరం పార్టీని లీడ్ చేసే వారు రాష్ట్ర స్థాయి నేతలు కావాల్సిన అవసరం ఉంది. అయితే తన పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి జనసేన తీర్చిదిద్దుకుంటే మరో గట్టి పోటీ అయితే తెలంగాణాలో చూడవచ్చు అని అంటున్నారు.

బహుముఖ పోటీలే :

మరో వైపు చూస్తే తెలంగాణా రాజకీయాల్లో బహుముఖ పోటీలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2018 లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి గణనీయంగానే ఓట్లను రాబట్టింది. అందువల్ల ఈసారి అంటే 2028 నాటికి టీడీపీ సైతం రంగాంలోకి దిగుతుందని అంటున్నారు అదే జరిగితే బహుముఖ పోటీలు అన్నవి ఖాయమని అంటున్నారు. అయితే జనాలు ఎవరిని ఆదరిస్తారు అన్నదే ప్రధానం. ఎంత మంది పోటీ చేసినా అధికారం విషయంలో అసలైన పోరు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్యనే కేంద్రీకృతం అవుతుందని అంటున్నారు జనసేన కూడా తన సత్తాను చాటుకోవాలంటే కష్టించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని అంటున్నారు. ఒంటరి పోరుతో బహుముఖ పోటీల మైందానంగా ఉన్న తెలంగాణాలో జనసేన ఏ మేరకు నెగ్గుకుని వస్తుంది అన్నది అయితే పెద్ద చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News