పదవి నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ - డిప్యూటీ సీఎం పవన్‌కు రాజీనామా పత్రం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన కీలక నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు.

Update: 2026-05-23 09:50 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన కీలక నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసిన తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జనసేన పార్టీలో ఒక కీలక ప్రజాప్రతినిధి తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కారణం ఇదేనా..?

విప్ పదవి నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ తప్పుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్లే తాను విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన చుట్టూ నెలకొన్న వివాదాలతో శ్రీధర్ ను రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తన వాదన వినిపించారని, పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తానని వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్యే శ్రీధర్ పై రైల్వేకోడూరుకు చెందిన ఓ మహిళ ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే తనను మోసం చేశారని ఆ మహిళ ఆరోపించగా, తనను హనీట్రాప్ చేశారని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను పార్టీ హైకమాండ్ ఆదేశించిందని చెబుతున్నారు. అయినప్పటికీ జనసేన వ్యవహారాల్లో ఎమ్మెల్యే చురుగ్గా పాల్గొంటున్నారని సదరు మహిళ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో తనపై వచ్చిన ఆరోపణలు, నియోజకవర్గంలో నెలకొన్న కొన్ని వివాదాస్పద అంశాలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు స్వయంగా వివరించారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో అసలేం జరిగింది? ఆరోపణల వెనక ఉన్న వాస్తవాలేంటి? అనే విషయాలను పవన్‌కు పూసగుచ్చినట్లు వివరించినట్లు పార్టీ వర్గాల సమాచారం. వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు, పార్టీ ప్రతిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆయన ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

రైల్వే కోడూరు నుంచి జనసేన జెండా ఎగురవేసి, విప్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. విప్ పదవికి రాజీనామా చేసినప్పటికీ, జనసేన పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతారని, కేవలం ఆరోపణలపై వివరణ ఇచ్చి పదవి నుంచి తప్పుకున్నారని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాజీనామాను పవన్ కళ్యాణ్ ఆమోదించారా లేదా అనేదానిపై జనసేన పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News