జమ్మూకశ్మీర్లో పెన్ డ్రైవ్ లు, వాట్సాప్ పై నిషేధం

జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం సైబర్‌ భద్రతను బలోపేతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-08-25 20:04 GMT

జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం సైబర్‌ భద్రతను బలోపేతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో డేటా భద్రతను పెంచడానికి, డేటా చోరీ, మాల్వేర్ దాడులు వంటి వాటిని నివారించడానికి అన్ని ప్రభుత్వ విభాగాల్లో పెన్‌డ్రైవ్‌ల వినియోగాన్ని తక్షణమే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సున్నితమైన.. అధికారిక సమాచారాన్ని పంచుకోవడానికి వాట్సాప్‌తో సహా ఇతర పబ్లిక్‌ మెసేజింగ్‌ యాప్‌లను ఉపయోగించవద్దని ఉద్యోగులను కఠినంగా హెచ్చరించింది.

సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కమిషనర్ సెక్రటరీ ఎం. రాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యకలాపాల కోసం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి పబ్లిక్ మెసేజింగ్ యాప్‌లు, ఐలవ్‌పీడీఎఫ్ వంటి సురక్షితం కాని ఆన్‌లైన్ సేవలను వాడటం డేటా భద్రతకు పెను ముప్పుగా మారే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో అనధికారిక పద్ధతుల్లో సమాచారాన్ని పంచుకోవడం వల్ల పలు భద్రతా సమస్యలు తలెత్తిన ఘటనలు వెలుగులోకి రావడంతో ఈసారి ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది.

- ప్రత్యామ్నాయంగా 'గవ్ డ్రైవ్'

పెన్‌డ్రైవ్‌లకు ప్రత్యామ్నాయంగా, ప్రభుత్వం 'గవ్ డ్రైవ్' అనే క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ సురక్షితమైన ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రతి ప్రభుత్వ అధికారికి 50 జీబీ సురక్షితమైన స్టోరేజ్ లభిస్తుందని, దీనివల్ల ఎక్కడి నుంచైనా సులభంగా ఫైళ్లను యాక్సెస్ చేసుకోవచ్చని ప్రభుత్వం వివరించింది.

- నిబంధనల ఉల్లంఘనకు కఠిన శిక్షలు

ఈ కొత్త మార్గదర్శకాలను అతిక్రమించిన వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిమిత సంఖ్యలో పెన్‌డ్రైవ్‌లకు అనుమతి ఇస్తామని, అది కూడా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నుండి ప్రత్యేక అనుమతి పొంది, భద్రతా తనిఖీ తర్వాత మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా సురక్షితమైన ఈ-గవర్నెన్స్ దిశగా జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ముందడుగు వేసింది. నిపుణులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Tags:    

Similar News