జైషే మహిళా ఉగ్రవాదులు.. 5 వేలు.. రూ.500.. 40 ని. ఆత్మాహుతి క్లాసులు
ఇప్పటివరకు పురుష ఉగ్రవాదులే ఎక్కువగా ఉన్నారు. మహిళలూ కొందరు ఉగ్రవాదం బాట పట్టినా.. ఆ సంఖ్య తక్కువే.;
ఇప్పటివరకు పురుష ఉగ్రవాదులే ఎక్కువగా ఉన్నారు. మహిళలూ కొందరు ఉగ్రవాదం బాట పట్టినా.. ఆ సంఖ్య తక్కువే. కానీ, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న భయంకర ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ ఏకంగా మహిళలతో ఆత్మాహుతి దళం (బ్రిగేడ్) ఏర్పాటు చేసింది.
పురుషులను మించిన ఉన్మాదులుగా.. భయంకర ఉగ్రవాద సంస్థలు ఐసిస్, ఎల్టీటీఈల తరహాలో ఆత్మాహుతి దాడులకు పాక్ ప్రేరేపిత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అయితే, ఇందులో సభ్యులు పురుషులు కాదు మహిళలు కావడం గమనార్హం. కఠిన శిక్షణలో మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా మహిళలను ఉసిగొల్పుతోందని కథనాలు వస్తున్నాయి. దీని వెనుక ఉన్నది ఎవరో కాదు. జేషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ సోదరి సాదియా. ఆపరేషన్ సిందూర్ లో మసూద్ కుటుంబంలోని 10 మందిని భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. చనిపోయిన వారిలో సాదియా భర్త కూడా ఉన్నాడు. ఆ పగతోనే సాదియాను మహిళా బ్రిగేడ్ కు సారథిని చేసినట్లు కనిపిస్తోంది. ఇందులోని సభ్యులు కేవలం భర్త, కుటుంబంలోని పురుషులతో తప్ప వేరే వారితో మాట్లాడేందుకు వీల్లేదు. దీన్నిబట్టే నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయో తెలుస్తోంది. ఇక మహిళా బ్రిగేడ్ లో చేరేందుకు రూ.500 విరాళం తీసుకుంటున్నారు. మొత్తం 5 వేల మంది సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రోజూ 40 నిమిషాలు సాగే జైషే మహిళా బ్రిగేడ్ ఆన్ లైన్ క్లాసులకు అఫీరా బాబీ నాయకత్వం వహిస్తోంది. ఈమె ఉగ్రవాది ఉమర్ ఫరూఖ్ భార్య. జేషేలో టాప్ కమాండర్ అయిన ఉమర్ 2019లో జరిగిన కశ్మీర్ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు..
కశ్మీర్ లోని పెహల్గాంలో అమాయక ప్రజలను కాల్చిచంపిన ఉగ్రవాదుల పనిపట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భావల్పూర్ లోని జైషే మొహమ్మద్ హెడాఫీస్ పై భారత్ బాంబులు వేసింది. మసూద్ కుటుంబంలోని 10 మందిని హతమార్చింది. ఈ దారుణ దెబ్బతో ఆ సంస్థ పంథా మార్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగమే జేషే మహిళా బ్రిగేడ్.
ఎర్రకోట పేలుడు దుర్మార్గంలోనూ పాత్ర..
గత నెలలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడులో జైషే మహిళా విభాగం పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణంలో కీలక పాత్రధారి డాక్టర్ షాహిన్ షాహిద్. జైషే మహిళా విభాగం జమాల్ ఉల్ మొమినాత్ లో ఈమె సభ్యురాలు. రెండు నెలల నుంచి భావల్పూర్ లో జైషే మహిళా బ్రిగేడ్ నియామకాలు మొదలయ్యాయి. 5 వేల మంది చేరగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ నుంచి పాక్ ప్రధాన నగరం కరాచీకి చెందినవారి వరకు వీరిలో ఉండడం గమనార్హం.