భగభగలో ACతో పనే లేదు.. జైపూర్ రూఫ్‌టాప్ టెక్నిక్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!
2026 వేసవి భగభగ మండుతోంది. భారతదేశంలోని ప్రధాన నగరాలు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నాయి.
2026 వేసవి భగభగ మండుతోంది. భారతదేశంలోని ప్రధాన నగరాలు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు చాలా చోట్ల 45డిగ్రీల సెంటిగ్రేడ్‌ని దాటిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అయితే ఎండ తీవ్రత ఉన్న క్లిష్ట పరిస్థితుల్లోను రాజస్థాన్‌లోని జైపూర్ నగరానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ సరికొత్త పర్యావరణహిత సాంకేతికతతో ముందుకు వచ్చింది. ఎటువంటి ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) ఉపయోగించకుండానే ఇళ్లను సహజసిద్ధంగా చల్లబరుస్తూ.. అదే సమయంలో సొంతంగా సేంద్రీయ ఆహారాన్ని పండించుకునేలా చేస్తున్న ఈ వినూత్న `రూఫ్‌టాప్ ఫార్మింగ్` (మిద్దె తోటల) పద్ధతి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో దీనికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ.. ఈ సరికొత్త ఆలోచనపై ప్రశంసల జల్లు కురిపించారు. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తు పరిణామాల గురించి మనకు ఇంకా పూర్తిగా తెలియదు. కానీ భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు తగ్గడం అనేది లేదు.. అవి మన జీవితంలో ఒక భాగం``అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో జైపూర్ వాసులు తమ జీవనశైలిని మార్చుకుంటూ... ఇళ్లను చల్లగా ఉంచుకోవడమే కాకుండా ఉత్పాదకతను పెంచుకుంటూ ముందడుగు వేయడం అభినందనీయమని.. భవిష్యత్తులో మనకు ఇలాంటి వినూత్న ఆలోచనలే ఎంతో అవసరమని ఆయన కొనియాడారు.
జైపూర్‌కు చెందిన `లివింగ్ గ్రీన్ ఆర్గానిక్స్` అనే స్టార్టప్ సంస్థ ఈ అద్భుతమైన కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జైపూర్ వంటి నగరాల్లో కాంక్రీట్ డాబాలు అత్యధికంగా వేడిని గ్రహించి ఇళ్ల లోపలి భాగాన్ని నిప్పుల కొలిమిలా మారుస్తాయి. దీనివల్ల ప్రజలు ఏసీలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సదరు స్టార్టప్ సంస్థ సులభంగా అమర్చుకోగలిగే పోర్టబుల్ రూఫ్‌టాప్ గార్డెనింగ్ కిట్లను అందిస్తోంది. ఇందులో లీక్-ప్రూఫ్ కంటైనర్లు, డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం).. పక్కా డ్రైనేజీ వ్యవస్థ ఉంటాయి. దీనివల్ల ఇంటి స్లాబ్‌కు ఎలాంటి నష్టం లేదా లీకేజీలు లేకుండానే డాబాపై మొక్కలను, కూరగాయలను సులభంగా పెంచవచ్చు.
మొదట చిన్న ప్రయోగంగా ప్రారంభమైన ఈ పర్యావరణహిత ఆలోచన, ప్రస్తుతం భారతదేశంలోని వివిధ నగరాల్లో దాదాపు 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు విస్తరించింది. ఈ పద్ధతిని అవలంబిస్తున్న ఇళ్లలో డాబాపై ఉండే పచ్చదనం కారణంగా సూర్యరశ్మి నేరుగా స్లాబ్‌పై పడకుండా వేడి తీవ్రత తగ్గుతుంది. దీనివల్ల ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు బాగా తగ్గడమే కాకుండా వేసవి కాలంలో కరెంట్ బిల్లులు కూడా భారీగా తగ్గుతున్నాయని ఇళ్ల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇళ్లు చల్లబడటమే కాకుండా.. రోజువారీ వంటకాల్లోకి కావాల్సిన తాజా ఆకుకూరలు, కూరగాయలు ఇంటిపైనే లభిస్తుండటం విశేషం.
వాతావరణ మార్పుల నేపథ్యంలో కేవలం కృత్రిమ శీతలీకరణ ఉపకరణాలపై ఆధారపడకుండా ఇలాంటి సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా నగరాలను నివాసయోగ్యంగా మార్చుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తక్కువ ఖర్చుతో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఆర్థికంగా కూడా ఆదా చేసే ఇటువంటి అర్బన్ ఫార్మింగ్ పద్ధతులు భవిష్యత్ తరాలకు ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసినట్లుగా.. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి.. నాణ్యమైన పట్టణ జీవనానికి ఇటువంటి సరికొత్త ఆలోచనలే నిజమైన దిక్సూచి.