జగన్ నోట రేవంత్.. మరి రేవంత్ దీటైన జవాబెప్పుడో?

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఇప్పటివరకు జగన్ ఆయనను వ్యక్తిగతంగా కలవలేదు.

Update: 2024-04-30 10:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కాక ఎండల కంటే ఎక్కువగా ముదురుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉండడంతో రాజకీయం రంజుగా సాగుతోంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతుండడంతో జాతీయ అంశాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఏపీలో మాత్రం రాష్ట్ర స్థాయి ప్రాధాన్యాలు తో పాటు సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన విషయాలను అందరు నేతలు ప్రముఖంగా ప్రస్తావనకు తెస్తున్నారు.

వివేకా హత్య కేసులో..

ఐదేళ్ల కిందట జరిగిన మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ వివేకా హత్య కేసు ఏపీలో ఇప్పటికీ హాట్ టాపిక్కే. అసలు నిందితులు ఎవరో ఇప్పటికీ తేలని నేపథ్యంలో.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డిలు తమకు న్యాయం చేయాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఇదే అంశంలో చిన్నాన్న వైఎస్ వివేకాను చంపింది ఎవరో ప్రజలకు తెలుసంటూ ఏపీ సీఎం జగన్ సొంత గడ్డ పులివెందులలో వ్యాఖ్యానించారు. కాగా, జగన్ తో వ్యక్తిగత విభేదాల నేపథ్యంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరారనే వాదన ఉండనే ఉంది. అయితే, షర్మిలను కాంగ్రెస్ లోకి పంపిందే టీడీపీ అధినేత చంద్రబాబు అని.. తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఆయన ఈ పని చేశారని జగన్ ఆరోపిస్తున్నారు. ఇలా తెలంగాణ సీఎం పేరును ఆయన ప్రస్తావిస్తున్నారు.

Read more!

శుభాకాంక్షలకే పరిమితం.. కలిసింది లేదు

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఇప్పటివరకు జగన్ ఆయనను వ్యక్తిగతంగా కలవలేదు. ఫోన్ లోనూ అభినందనలు తెలిపినట్లు లేదు. శుభాకాంక్షల ప్రకటన ఏమైనా చేసి ఉండొచ్చు. ఇదే సమయంలో కేసీఆర్ ను మాత్రం జగన్ కలిశారు. ఆయన కింద పడినప్పుడు జగన్ స్వయంగా హైదరాబాద్ వచ్చి పరామర్శించారు. అంతేకాని.. రేవంత్ ను మాత్రం పట్టించుకోలేదు. రేవంత్ పక్కా చంద్రబాబు మనిషి అనేది జగన్ గట్టి నమ్మకం. తాను విశ్వసించని వారిని జగన్ అసలు దగ్గరకే రానీయరు అనే సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారంలో మాత్రం చెల్లి షర్మిల తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతుండడంతో జగన్ మొత్తంగా ఆమె రాజకీయ నేపథ్యాన్నే ప్రశ్నిస్తున్నారు.

మరి రేవంత్ ఎప్పుడు బదులిస్తారో...?

జగన్ స్వయంగా కలవనప్పటికీ రేవంత్ పేరును రాజకీయాల నేపథ్యంలో ప్రస్తావిస్తున్నారు. అయితే, రేవంత్ మాత్రం దీనిపై స్పందించాల్సి ఉంది. చంద్రబాబు శిష్యుడను అనే విమర్శకు బదులివ్వాల్సి ఉంది. వాస్తవానికి రేవంత్ సైతం జగన్ ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కేవలం పొరుగు రాష్ట్ర సీఎంగానే చూస్తున్నారు. ఇదే విషయం ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. రేవంత్ పక్కా రాజకీయ నాయకుడు. జగన్ తనను విస్మరిస్తున్నారనే సంగతి గ్రహించలేని నాయకుడేమీ కాదు. కాకపోతే సమయం వచ్చినప్పుడు స్పందిద్దామనే ధోరణితో ఉన్నారని భావించవచ్చు. ఆ వేల సమీపించినప్పుడు రేవంత్ తనదైన శైలిలో జగన్ కు జవాబివ్వడం ఖాయం. అది.. ఏపీ ఎన్నికల ప్రచారంలోనే జరగొచ్చు.

Tags:    

Similar News