క్యాడర్ ఓకే...లీడర్ సంగతేంటి ?
ఏ రాజకీయ పార్టీకి అయినా క్యాడర్ చాలా ముఖ్యం. అలాగే వారిని నడిపించే లీడర్ కూడా ముఖ్యం.
ఏ రాజకీయ పార్టీకి అయినా క్యాడర్ చాలా ముఖ్యం. అలాగే వారిని నడిపించే లీడర్ కూడా ముఖ్యం. ఎవరి ప్రాధాన్యత వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాదు ఈ రెండింటి మధ్యన కో ఆర్డినేషన్ ఉండాలి. అధినేత ఇద్దరికి ఎంతెంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలో అంతా ఇచ్చి పార్టీ పటిష్టతకు ఉపయోగించుకోవాలి. అంతే తప్ప ఎపుడూ ఒక వైపే చూపు ఉండకూడదు. వైసీపీలో అయితే 2019 దాకా లీడర్లు క్యాడర్ అంతా ఒక్కటై పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం కోసం పోరాడారు. తీరా 2019లో అధికారంలోకి వచ్చాక అధినేత పార్టీని పక్కన పెట్టేశారు. దాంతోనే క్యాడర్ తీవ్ర అసంతృప్తికి గురి అయి దూరం అయింది. లీడర్లు అయితే సైడ్ అయిపోయిన వారు పోగా అధికారంలో ఉన్న వారు తమ వరకూ తాము చూసుకున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.
జగన్ 2.0 అంటూ :
ఇక వాలంటీర్లతో సర్వం సహా అని అన్నీ చేయించింది వైసీపీ ప్రభుత్వం. ప్రజలకు వారే నేరుగా తెలిసే వారు. పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ వారికి అసలు గుర్తుండే చాన్సే లేకుండా చేసింది వైసీపీ అధినాయకత్వం అతి ఉత్సాహం. హైకమాండ్ చేసిన నూతనమైన ప్రయోగం. అయితే అది సంస్థాగతంగా ఆధారపడిన పార్టీలకు ఎంత చేటు తెస్తుందో ఒక గుణపాఠంగా వైసీపీకి 2024 ఎన్నికల్లో స్పష్టంగా చెప్పింది. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేతలో మార్పు వచ్చింది. జగన్ 2.0లో క్యాడర్ ఫస్ట్ అని అంటున్నారు. దాంతో క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది.
అన్నీ వారి చేతులో మీదే :
సంక్షేమ పధకాలు అన్నీ క్యాడర్ చేతుల మీదనే అని జగన్ ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తాజాగా పోలవరం జిల్లా పార్టీ నేతల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. దాంతో చప్పట్ల వర్షం కురిసింది. అంతవరకూ బాగానే ఉన్నా తమ సంగతేంటని వైసీపీ లీడర్లు ఇపుడు మధనపడుతున్నారని అంటున్నారు. క్యాడర్ అన్నీ అయితే లీడర్ ఏమి చేయలాని జనాల వద్దకు ఎలా వెళ్లాలి అని వారు వాపోతున్నారని కూడా అంటున్నారు.
నాయకుడే సారధిగా :
అయితే వైసీపీలో క్యాడర్ తో పాటు నాయకులకూ పెద్ద పీట వేస్తామని జగన్ చెప్పాలని అంటున్నారు. నియోజకవర్గం ఇంచార్జిలు ఉంటారు. వీరిలో చాలా మంది రేపు ఎమ్మెల్యే అభ్యర్ధులు అవుతారు. వైసీపీ గెలిస్తే వారే ఎమ్మెల్యేలు అవుతారు. వారితో పాటుగా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కూడా ఉంటారు. వీరంతా కలిసి క్యాడర్ ని కలుపుకుంటేనే పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉంటుంది. అలా కాకుండా వాలంటీర్ల ప్లేస్ లో క్యాడర్ ని ముందు పెడితే నాయకులు అంతా ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉండిపోవాల్సి వస్తుందని కూడా అపుడే ఆందోళన వ్యక్తం అవుతోంది. పార్టీకి సంపూర్ణత్వం వచ్చేలా అందరినీ ఒకే విధంగా సమాదరించేలా అధినాయకత్వం నిర్ణయాలు ఉండాలి తప్పించి ఈ విధంగా ఒకరికి పెద్ద పీట అంటే పైన ఉన్న నాయకత్వానికి దిగువన క్యాడర్ కి అది ఒక తెలియని గ్యాప్ గా మారుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో లీడర్లకు జగన్ ఏ విధంగా హామీ ఇస్తారో 2.0 పాలనలో వారిని ఎలా కీలకం చేస్తారో చూడాల్సి ఉంది.