జగన్ 2.0 ఎలా సాధ్యమో కర్నూలు నేతలకు క్లారిటీగా చెప్పేశారు
ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు జగన్ నోటి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది.;
తిరుగులేని మెజార్టీతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు.. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం వరుస పెట్టి చేస్తున్న తప్పుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా? అంటూ పార్టీ నేతలకు చెబుతున్నారు జగన్. తాజాగా కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో భేటీ అయిన ఆయన.. ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. పార్టీ మళ్లీ అధికారంలోకిఎలా సాధ్యమవుతుందన్న అంశాల్ని సుదీర్ఘంగా వివరించినట్లుగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు జగన్ నోటి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రజలకు మంచి చేసి వారి మనసుల్లో చోటు దక్కించుకునేలా నాయకుడి పాలన ఉండాలని.. అధికారం ఉంది కదా అని దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు.. దేవుడు మొట్టికాయలు వేస్తారని చెప్పుకొచ్చారు. ఏపీ.. తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్ సైడ్ గా ఇచ్చిన తీర్పుల్ని చూశాం.. ప్రజలు ఈ పక్కన తంతే.. ఆ పక్కన పడతారు. అందుకే చంద్రబాబు మనల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు. మనమంతా ఐక్యంగా ఉండాలంటే పార్టీ నేతలకు హితబోధ చేశారు జగన్.
జగన్ 2.0 సాధ్యమేనన్న విషయాన్ని పార్టీ నేతలకు నమ్మకంగా చెప్పిన ఆయన.. ఈ సందర్భంగా చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘మీరంతా నా వెంట ఉండాలి.. కళ్లు మూసుకొంటే మూడేళ్లు గడిచిపోతుంది. ఈ మూడేళ్లు నాతో ఉండండి. మీకు జగన్ 2.0 చేసి చూపిస్తా. తర్వాత ఎన్నికల్లో మనదే గెలుపు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అంటూ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించేలా మాట్లాడారు. సంఖ్యా బలం లేకున్నా ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు దిగారని.. చంద్రబాబు హుందాగా వ్యవహరించలేదన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి.. అన్ని పదవులు తమకే కావాలన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మనోళ్లను భయభ్రాంతులకు గురి చేశారన్న జగన్.. పోలీసుల్ని వాచ మెన్ కంటే ఘోరంగా వాడుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. సూపర్ 6 అమలులో విఫలమయ్యారని.. పాలనా వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారన్న జగన్.. ‘ఆ భయంతోనే నన్ను మాట్లాడనివ్వకుండా ప్రయత్నిస్తున్నారు. నా గొంతు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ విమర్శలు గుప్పించారు.