నాడు చంద్రబాబుకు.. నేడు జగన్‌కు ఒకే అనుభవం!
దీనిపై కోర్టు కూడా.. వివరాలు తీసుకుంది. జగన్‌కు కల్పిస్తున్న భద్రత ఎలా ఉంది? ఏయే విషయాలు పాటిస్తున్నారన్న విషయాలను తెలుసుకుంది.;

ఏపీలో సరికొత్త రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. తమ నాయకుడు ప్రజల్లోకి వెళ్తుంటే.. రోప్ వే(పెద్ద తాడుతో పోలీసులు ప్రజలను నిలువరించే ప్రయత్నం) భద్రత కల్పించడం లేదని.. వైసీపీ నాయకులు పోస్టులు పెడుతున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. జగన్‌కు జడ్+ కేటగిరీ భద్రత ఉందని.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆమేరకు ఆయనకు భద్రతను కల్పించడం లేదని చెబుతున్నారు.
దీనిపై కోర్టు కూడా.. వివరాలు తీసుకుంది. జగన్‌కు కల్పిస్తున్న భద్రత ఎలా ఉంది? ఏయే విషయాలు పాటిస్తున్నారన్న విషయాలను తెలుసుకుంది. ముఖ్యంగా జడ్+ కేటగిరీ భద్రతపై ఆరా తీసింది. అయితే.. తాము జడ్ + కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీనిలో రోప్ వే ఉందా? లేదా? అనేది సర్కారు చెప్పలేదు. కానీ.. వాస్తవానికి వైసీపీ నాయకులు మాత్రం రోప్ వే భద్రతను కోరుకుంటున్నారు.
దీనిని ఇవ్వడానికి కూటమి సర్కారు వెనుకాడుతోంది. రోప్ వే.. అనేది భారీ ఎత్తున ప్రజలు వచ్చినప్పుడు.. సదరు నాయకుడికి భద్రత కల్పించేందుకు ఇచ్చేది. దీనిని గతంలో చంద్రబాబు పర్యటనల సమయం లో వైసీపీ సర్కారు ఏర్పాటు చేయలేదు. ఆనాడు కూడా ఇదే తరహాలో ప్రభుత్వం వ్యవహరించింది. కేంద్రంతో మాట్లాడి చంద్రబాబు భద్రత తెచ్చుకున్నారు. ఆ క్రమంలోనే ఆయనకు రోప్ వే ఏర్పాటుకు.. వైసీపీ దిగి వచ్చింది.
ఇప్పుడు సేమ్ సీన్ వైసీపీ అధినేతకు కూడా రిపీట్ అయింది. గతంలో చంద్రబాబును ఏ నియమాల పేరుతో ఆయన అడ్డుకున్నారో.. ఇప్పుడ కూడా అవే నియమాలు ఆయనకు కూడా అడ్డు వస్తున్నాయి. జడ్ + కేటగిరీ భద్రతలో ఉంటే.. రోప్ వే ఎక్కడుందని.. అప్పట్లో సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన పార్టీకి దూరమైనా.. ఆ వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ విషయంలోనూ హోం మంత్రి అనిత ఇదే ప్రశ్నిస్తున్నారు. ఆయనకు మాజీ సీఎంగా మాత్రమే భద్రత కల్పిస్తున్నామన్నారు.