జగన్ దూకుడు.. గవర్నర్ తో కీలక భేటీ, ఎందుకంటే..?
వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత నెక్ట్స్ ముఖ్య నేత అరెస్టు అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు, గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులను ప్రభుత్వ ఆదేశాలతో సిట్ అరెస్టు చేస్తున్న వేళ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత నెక్ట్స్ ముఖ్య నేత అరెస్టు అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది. మద్యం కేసులో మాజీ సీఎం జగన్ కు కిక్ బ్యాక్ అందిందని ఆరోపిస్తూ సిట్ అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ పరిస్థితుల్లో గవర్నరుతో జగన్ భేటీ కానుండటం ఉత్కంఠ రేపుతోంది.
ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకే..
మద్యం స్కాంపై చార్జిషీటులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పేరు ప్రస్తావించడంతో ఆయనను అరెస్టు చేస్తారా? అన్న చర్చ మొదలైంది. అయితే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను అరెస్టు చేయాలంటే తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సివుంది. మరోవైపు లిక్కర్ స్కాంలో తొలి చార్జిషీటు దాఖలు చేసిన సిట్ అనుబంధ చార్జిషీటు దాఖలకు మూడు వారాల సమయం కోరింది. ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో ఈ గడువు ముగియనుంది. అంటే జగన్ విషయంలో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. దీంతో గవర్నర్ తో భేటీ కావాలని మాజీ సీఎం జగన్ నిర్ణయించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
గవర్నర్ తో భేటీ ఎందుకు?
లిక్కర్ స్కాంపై చురుగ్గా దర్యాప్తు జరుగుతున్న సమయంలో మాజీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఎందుకు భేటీ అవ్వాలని అనుకుంటున్నారన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. తన అరెస్టుకు అనుమతి ఇవ్వొద్దని కోరునున్నారా? లేక ఇంకేమైనా ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే వైసీపీ నేతలనే టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తుందన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకే మాజీ సీఎం గవర్నర్ తో భేటీకి సమయం కోరినట్లు చెబుతున్నారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించడంతో ప్రస్తుతం బెంగళూరులో ఉన్న మాజీ సీఎం తాడేపల్లి వచ్చారని అంటున్నారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులతోపాటు తన జిల్లాల పర్యటనపై విధిస్తున్న ఆంక్షలపై కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వరుస కార్యక్రమాలు
బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్ రానున్న మూడు నాలుగు రోజులు పూర్తి బిజీగా గడపనున్నారు. ఈ రోజు సాయంత్రం గవర్నర్ తో భేటీ జరగనుండగా, రేపు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీతో సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే నెలలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉందన్న అంచనాతో ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే ఎలా స్పందించాలన్న అంశంపై వైసీపీ అధినేత పీఏసీ దిశానిర్దేశం చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే అరెస్టు అయిన వారిని కేసుల నుంచి బయట పడేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు క్షేత్రస్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలపైనా అధినేత సూచనలు చేయనున్నారని అంటున్నారు. ఇక వివిధ ఆరోపణలతో అరెస్టు అయి ప్రస్తుతం రిమాండు ఖైదీలుగా జైలులో ఉన్న రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించేందుకు మాజీ సీఎం రాజమండ్రి, నెల్లూరులో పర్యటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ నెల 31న నెల్లూరు వెళ్లి అక్కడి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అవ్వాలని మాజీ సీఎం జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా వచ్చేనెల 5న రాజమండ్రిలో ఎంపీ మిథున్ రెడ్డితో భేటీ కావాలని భావిస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయిన కాకాణిని ఇంతకుముందే జగన్ పరామర్శించాల్సివుంది. అయితే అప్పట్లో జగన్ హెలిప్యాడ్ కోసం వైసీపీ అడిగిన చోట కాకుండా, మరో చోట స్థలం చూపడంతో ఆ పర్యటన వివాదాస్పదమైంది. దీంతో ఆయన నెల్లూరు పర్యటనను గతంలో రద్దు చేసుకున్నారు. అయితే కాకాణి ఇంకా జైలులో ఉండటం, ఈ కేసులో మరో మంత్రి అనిల్ కుమార్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారంతో జగన్ తన నిర్ణయం మార్చుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కాకాణితో ములాఖత్ అవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈ పర్యటనలోనే టీడీపీ కార్యకర్తలు దాడితో ధ్వంసమైన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని పరిశీలించి ఆయనను పరామర్శిస్తారని చెబుతున్నారు.