ఆ మీడియాలపై దాడి వేరే లెవల్ లో ఉంటుంది.. జగదీష్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

జగదీష్ రెడ్డి మీడియా సమావేశంలో దాడికి బీఆర్ఎస్ కార్యకర్తలే బాధ్యత వహిస్తారని స్పష్టంగా అంగీకరించారు.;

Update: 2025-06-30 06:38 GMT

మహాన్యూస్ టీవీ కార్యాలయంపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసిన నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఈ దాడిని సమర్థిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆంధ్ర-తెలంగాణ ప్రాంతీయ భేదాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయన్న ఆరోపణలకు దారితీశాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

జగదీష్ రెడ్డి మీడియా సమావేశంలో దాడికి బీఆర్ఎస్ కార్యకర్తలే బాధ్యత వహిస్తారని స్పష్టంగా అంగీకరించారు. అంతేకాకుండా, కొన్ని మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఇవి జర్నలిజం పేరుతో తెలంగాణలో నరబలి మందిరాలు నడుపుతున్నాయి" అంటూ ఆయన ధ్వజమెత్తారు. "తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరు చేసినందుకే ఇవి కోపంతో నిండిపోయి, కేటీఆర్, కేసీఆర్‌లపై విష ప్రచారం చేస్తున్నాయి" అని ఆరోపించారు.

-'ఎక్కడ బతుకుతున్నావ్? ఎవరి అన్నం తింటున్నావ్?'

"ఎక్కడ బతుకుతున్నావ్? ఎవరి అన్నం తింటున్నావ్? తెలంగాణలో ఉండి తెలంగాణను ఎందుకు తిడుతున్నావ్?" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆంధ్రా వ్యక్తులు నడుపుతున్న మీడియా సంస్థలు తెలంగాణలో స్వేచ్ఛగా పని చేయకూడదు అన్న సంకేతాన్ని ఈ వ్యాఖ్యలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ప్రాంతీయ భావోద్వేగాలను మళ్లీ రెచ్చగొట్టే ప్రమాదకర ప్రయత్నంగా పరిగణించబడుతోంది.

-'పోలీసులు రక్షించలేరు.. కేసీఆర్ క్షమించినా మేము క్షమించం'

"మీడియా ఛానెళ్లను ఎటువంటి పోలీసులు రక్షించలేరు. కేసీఆర్ క్షమించినా మేము క్షమించం" అనే జగదీష్ రెడ్డి ప్రకటనలు ప్రజాస్వామ్య స్వేచ్ఛా విలువలను ఖండించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా నిలిచే పాత్రికేయతను బెదిరింపులకు గురిచేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.

-ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం?

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న విమర్శలను ఎదుర్కొనేందుకు, పాత ప్రాంతీయ వివాదాలను మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడుస్తున్నా, ఇప్పటికీ ఈ భేదాలను వాడుకోవడం శ్రేయస్కరం కాదంటున్నారు. భవిష్యత్తులో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News