బాంబులతో కాదు.. ’కాంతి’ చూపుతో చంపేస్తా.. ఇజ్రాయెల్ నయా ఆయుధం
ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెలే.. చుట్టూ శత్రువులున్నా.. నిత్యం ప్రమాదం పొంచి ఉన్నా.. దాదాపు 80 ఏళ్లుగా అజేయ శక్తిగా ఉందంటేనే దాని సత్తా ఏమిటో చెబుతోంది.;
ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెలే.. చుట్టూ శత్రువులున్నా.. నిత్యం ప్రమాదం పొంచి ఉన్నా.. దాదాపు 80 ఏళ్లుగా అజేయ శక్తిగా ఉందంటేనే దాని సత్తా ఏమిటో చెబుతోంది. అంతెందుకు?? 2023 అక్టోబరు 7న హమాస్ చేసిన దాడి అనంతరం ఏడాదిన్నరకు పైగా నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం అందరూ చూస్తున్నదే. ఈ క్రమంలోనే దాని ఐరన్ డోమ్ ప్రత్యేకత ఏమిటో అందరికీ అర్థమైంది.
తాజాగా ఇజ్రాయెల్ ’కాంతి ఖడ్గం’ను బయటకు చూపించింది. యుద్ధంలోనూ ప్రయోగించి.. పదికిపైగా డ్రోన్లకు కూల్చివేసింది. ఇంతకూ ఏమిటీ కాంతి ఖడ్డం అంటే.. అదొక లేజర్ ఆయుధం.
ఐరన్ బీమ్ వ్యవస్థలో తక్కువ శక్తిమంతమైన ఆయుధం వాడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ సరికొత్త విధానంలో తక్కువ శక్తి లేజర్ బీమ్.. ఇంటర్ సెప్టర్ (శత్రువు ఆయుధాలను అడ్డుకునే)గా వినియోగించింది.
హెజ్బొల్లా, హూతీలు, ఇరాన్, హమాస్.. ఇలా ఇజ్రాయెల్ ఏకకాలంలో నలుగురితో యుద్ధం చేస్తోంది. మరీ ముఖ్యంగా హెజ్బొల్లాల నుంచి డ్రోన్ల దాడి ముప్పు నెలకొంది. ఐరన్ డోమ్ తో క్షిపణులను అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ కు.. ఇదొక తలనొప్పిగా మారింది. అందుకని.. లేజర్ కాంతి ఖడ్గాన్ని డెడ్ లైన్ కంటే ముందే చకచకా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. కొద్ది నెలల్లో సైన్యానికి పూర్తిస్థాయిలో అందించనుంది. ఐరన్ బీమ్ గా పేర్కొంటున్న ఈ వ్యవస్థతో హెజ్బొల్లా డ్రోన్లను కూల్చివేసిన దృశ్యాలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.
మరో ఘనత ఏమంటే.. దీనిని ఇజ్రాయెల్ కు చెందిన రఫేల్ సంస్థ తయారు చేసింది. ప్రపంచంలో తొలిసారి అత్యంత శక్తిమంతమైన లేజర్ ను వినియోగించి.. యుద్ధాల్లో ఇంటర్ సెప్ట్ చేసిన తొలి దేశం ఇజ్రాయెల్ కావడం.
ఇజ్రాయెల్ వద్ద మూడు రకాల లేజర్ ఆయుధాలు ఉన్నాయి. అవి..
ఐరన్ బీమ్-ఎం, లైట్ బీమ్, నేవల్ ఐరన్ బీమ్. వీటిలో మొదటిది
భారీ వాహనాలపై అమర్చే శక్తిమంతమైన ఆయుధం. 50 కిలోవాట్ల శ్రేణి లేజర్ తో శత్రువుల ఆయుధాలను కూల్చేస్తుంది. తేలికపాటి వెర్షన్ గా భావించి లైట్ బీమ్‌ను చిన్న వాహనాలపై నుంచి ఉపయోగించవచ్చు. ఇది 10 కిలోవాట్ల శ్రేణి హైఎనర్జీ లేజర్ ఆయుధం. యూఏవీలు, డ్రోన్లపై ప్రభావంతంగా పనిచేస్తుంది. కిలోమీటర్ల దూరంలోని 10 లక్ష్యాలను కూల్చగలదు. ఇక యుద్ధ నౌకల నుంచి వినియోగించే నేవల్ ఐరన్ బీమ్ 100 కిలోవాట్ల హై ఎనర్జీ లేజర్‌ను వాడి యుద్ధ నౌకలను రక్షిస్తుంది.