ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం.. ప్రపంచానికి కొత్త భారం

ఇప్పుడున్న సమస్యలు సరిపోవన్నట్లుగా తాజాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం ప్రపంచానికి సరికొత్త భారంగా మారనుంది.;

Update: 2025-06-15 08:30 GMT

ఇప్పుడున్న సమస్యలు సరిపోవన్నట్లుగా తాజాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం ప్రపంచానికి సరికొత్త భారంగా మారనుంది. ఇప్పటికే మాంద్యం.. రష్యా - ఉక్రెయిన్, ఇజ్రాయెల్ - గాజా మధ్య నెలకొన్న యుద్ధంతో పాటు ట్రంప్ విధానాలతో ఆర్థిక పరిస్థితి ఆగమాగంగా మారింది. ఇలాంటి వేళ.. తాజాగా మొదలైన యుద్దం కొత్త సమస్యలకు తెర తీయటమే కాదు.. జీవన వ్యయాన్ని మరింత పెంచనుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముడిచమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అదే సమయంలో విమానయానం మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది.

ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ లయన్.. దానికి ప్రతిగా ఇరాన్ ప్రతీకార దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి తెర తీస్తున్న పరిస్థితి. ఇరాన్ నుంచి ముడిచమురు సరఫరాలో జరిగే అంతరాయం ముడి చమురుకు రెక్కలు రావటమే కాదు.. భారీ ఎత్తున ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇరాన్ నిత్యం 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి చేస్తోంది. ఇందులో 1.5 మిలియన్ బ్యారెళ్లను ఎగుమతి చేస్తుంది.

ఇదొక అంశమైతే.. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారా సాగుతుంది. తమపై దాడులకు దిగితే తాము ఈ రవాణా మార్గాన్ని అడ్డుకుంటామని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఇరాన్ తాను చెప్పినట్లుగా ఇరాన్ జలసంధిని మూసేస్తే.. ముడిచమురు ధరలు బ్యారెల్ కు 120 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే సామాన్యుడి జీవితం మొదలు అన్ని వర్గాల వారికి తలనొప్పుల్ని తెచ్చి పెడుతుంది.

జలరవాణాను అడ్డుకోవటమే కాదు గగతలాన్ని మూసివేసిన పక్షంలో విమానయాన ఖర్చులు భారీగా పెరగనున్నాయి. విమాన సర్వీసులు ఆలస్యమవుతాయి. తిరిగి రావాల్సి ఉంటుంది కాబట్టి.. విమానాల్లో ప్రయాణించే వారికి తలనొప్పులు తప్పవు. ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం కారణంగా ముంబయి -లండన్ మార్గం సహా సౌదీ అరేబియా.. తుర్కియే మార్గాల్లో రద్దీ పెరుగుతుంది. ఫలితంగా విమాన రద్దీ నియంత్రణపై ఒత్తిడి పెరుగుతుంది. నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. దీంతో.. టికెట్ ధరలు పెరగటం ఖాయం. మరోవైపు ఈ తాజా ఘర్షణలతో బంగారం ధరలు కూడా భారీగా పెరిగే వీలుంది. యుద్ధ సమయాల్లో పెట్టుబడిదారులు నష్టభయం లేని బంగారం లాంటి వాటిల్లో పెట్టుబడులుపెడతారు. దీంతో సహజంగానే పసిడి ధర పెరుగుతుంది.

సూయిజ్ కెనాల్ , ఎర్ర సముద్ర మార్గాల్ని మూసివేత కారణంగా భారత్ ఎగుమతులకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఇజ్రాయెల్ - ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో భారత ఎగుమతులు వేరే మార్గాలకు మళ్లించాల్సి వస్తుంది. దీంతో కచ్చితంగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. అంతేకాదు.. సరుకు రవాణా వ్యవస్థ మీదా ప్రభావం పడుతుంది. ఇప్పటి డెలివరీలతో పోలిస్తే 15 -20 రోజులు ఆలస్యంగా వస్తువులు గమ్యస్థానానికి చేరుకోవటానికి సమయం పడుతుంది. ఇది కూడా ఆర్థిక భారంగా మారనుంది. ఇది భారత్ వరకు వచ్చే లెక్కలు. ఇదే విధంగా ప్రపంచంలోని పలు దేశాలు కూడా ప్రభావితం కానున్నాయి. మరి.. వీటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News