టార్గెట్ భారత్... షాకింగ్ గా ఐఎస్ఐ, పాక్ సైన్యం ‘సెకండ్ జనరేషన్’ ప్లాన్!
టార్గెట్ భారత్ అనేది పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం, భద్రతా సంస్థలు, ప్రధానంగా ఆ దేశ దత్తపుత్రులైన ఉగ్రవాదులకు ప్రధాన లక్ష్యం అనేది తెలిసిన విషయమే.;
టార్గెట్ భారత్ అనేది పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం, భద్రతా సంస్థలు, ప్రధానంగా ఆ దేశ దత్తపుత్రులైన ఉగ్రవాదులకు ప్రధాన లక్ష్యం అనేది తెలిసిన విషయమే. వాళ్ల బ్రతుకు వాళ్లు చూసుకోకుండా.. భారత్ ను దెబ్బకొట్టాలనే నిత్యం కలలు కంటూ ప్రణాళికలు రచిస్తుంటారు. ఈ క్రమంలో... సెకండ్ జనరేషన్ ఉగ్రవాద నాయకత్వాన్ని నిర్మించడానికి వారంతా కృషి చేస్తున్నారని.. దీనికోసం పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుతున్నాయని చెబుతున్నారు. ఇది షాకింగ్ గా మారింది.
అవును... ఇటీవల పాకిస్తాన్ లోని బహవల్ పూర్ లో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐ.ఎస్.ఐ.), పాకిస్తాన్ ఆర్మీ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని.. ఈ సమావేశంలో తదుపరి తరం నాయకత్వంగా అభివర్ణించబడే ఉగ్రవాద సంస్థల సీనియర్ కమాండర్లు పాల్గొన్నారని.. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ లోకి పెద్ద ఎత్తున చొరబాట్లను ప్లాన్ చేయడం చేస్తున్నారని.. దీనికి వృద్ధాప్య ఉగ్రవాద కమాండర్ల కుమారులు, దగ్గరి బంధువులు నాయకత్వం వహిస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో.. జమ్మూ కాశ్మీర్ లో సమన్వయంతో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కలిసి పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో లష్కరే కార్యకర్తలు తల్హా సయీద్, సైఫుల్లా కసూరి.. బహవల్ పూర్ లో జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తో రహస్య సమావేశం నిర్వహించారని చెబుతున్నారు. వాస్తవానికి పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా ఇలాంటి కో-ఆర్డినేషన్ సమావేశాలు జరిగాయని అంటున్నారు.
ప్రధానంగా... హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వృద్ధాప్య ఉగ్రవాద నాయకుల నుండి వారి వారసుల వైపు (రెండో తరం) దృష్టిని మళ్లిస్తున్నట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఈ కొత్త ప్రయత్నంలో అత్యంత ప్రముఖ వ్యక్తులలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా ఉన్నాడని.. సైద్ధాంతికంగానే కాకుండా సంస్థాగత నిర్వహణ, నిధుల నెట్ వర్క్ లు మొదలైన విషయాల్లో అతన్ని క్రమపద్ధతిలో తీర్చిదిద్దుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే... అంతర్జాతీయ వేదికలపై మాత్రం ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని ఊకదంపుడు ఉపన్యాశాలు ఇస్తున్న పాకిస్తాన్.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తీ భిన్నంగా ప్రవర్తిస్తుందని నిఘా అధికారులు చెబుతున్నారు. ఈ వ్యూహం ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు... మురిద్కేలోని మర్కజ్-ఎ-తోయిబాలో ఉన్న లష్కరే-తోయిబా ప్రధాన కార్యాలయం మరోసారి పునరుద్ధరించబడుతోందని చెబుతున్నారు.
ఇదే కాకుండా... 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత్ దెబ్బకు దెబ్బతిన్న భవనాలను పెద్ద ఎత్తున నిధులతో పునర్నిర్మించారని.. ఈ పునర్నిర్మాణ ప్రయత్నం పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాద మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టమైన సూచన అని.. నిఘా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని.. మురిద్కే, పరిసర ప్రాంతాలను, సరిహద్దు వెంబడి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాయని అంటున్నారు.