ఇరాన్ సెగతో అమెరికాకు కాసుల పంట.. భారీ ఆయుధ ఒప్పందాల వెల్లువ!
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ ఒప్పందంపై అత్యంత వేగంగా స్పందించారు.;
అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ నీతి ఎప్పుడూ చర్చనీయాంశమే. ఒకవైపు ఆ యుద్ధాన్ని నేనే ఆపాను.. ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అని ప్రపంచం నమ్మని గొప్పలు చెప్పుకుంటూనే యుద్ధాలను నివారించే పెద్దన్నగా కనిపిస్తూనే, మరోవైపు యుద్ధ భయాన్ని సృష్టించి తన ఆయుధ వ్యాపారాన్ని పెంచుకుంటోందన్న విమర్శలు ఇప్పుడు ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బలపడుతున్నాయి.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను అమెరికా తన ఆర్థిక లాభం కోసం వాడుకుంటోందనే ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్‌ను యుద్ధంలోకి దింపడం ద్వారా దాని పొరుగున ఉన్న ఇస్లాం దేశాల్లో అభద్రతా భావాన్ని సృష్టించి, ఆ దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించడమే అమెరికా అసలు అజెండా అని విశ్లేషకులు భావిస్తున్నారు. శాంతి చర్చల పేరుతో ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి, ఈ విరామ సమయంలో తన వెపన్ మార్కెట్‌ను అగ్రరాజ్యం విస్తరిస్తోందని చెప్పేందుకు భారీ డీల్ ఉపయోగపడుతుంది.
భారీ ఆయుధ ఒప్పందం
ఇరాన్ తమపై దాడి చేయవచ్చనే భయంతో ఉన్న నాలుగు దేశాలకు అమెరికా భారీ ఎత్తున యుద్ధ సామగ్రిని విక్రయించేందుకు సిద్ధమైంది. మొత్తం $9 బిలియన్ల (దాదాపు రూ. 85,000 కోట్లు) విలువైన ఆయుధాల విక్రయానికి ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్, కువైట్, ఖతర్, మరియు యూఏఈ (UAE)కి ఈ ఆయుధాలను సరఫరా చేయనున్నారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు ఈ దేశాలకు అత్యాధునిక వెపన్స్ అవసరమని అమెరికా ఈ డీల్ సమర్థించుకుంటోంది.
మార్కో రూబియో వేగం
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ ఒప్పందంపై అత్యంత వేగంగా స్పందించారు. ఆర్డర్ ప్లేస్ చేసిన దేశాలకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే ఆయుధాలను పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉద్రిక్తతలు ఉన్నప్పుడే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఈ లోపు ఆయుధాల మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని అగ్రరాజ్యం భావిస్తోంది.
యుద్ధమే పెట్టుబడి!
అమెరికా విదేశాంగ విధానంపై అంతర్జాతీయ నిపుణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇరాన్ సమీప ఇస్లాం దేశాలపై దాడి చేసే అవకాశం ఉందంటూ కృత్రిమంగా యుద్ధ భయాన్ని సృష్టించి, తన వెపన్ మార్కెట్‌ను పెంచుకోవడమే అమెరికా ప్రధాన అజెండా అని విమర్శకులు మండిపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ గొడవలు జరిగినా, అక్కడ అమెరికా ఆయుధాలు ప్రత్యక్షమవ్వడం వెనుక పెద్ద ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని వాదిస్తున్నారు.
ఒకవైపు ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తూ, మరోవైపు ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని వేడెక్కించడం ద్వారా అమెరికా తన ఖజానాను నింపుకుంటోంది. ఈ క్రమంలో రూ. 85 వేల కోట్ల విలువైన ఆయుధ ఒప్పందం పశ్చిమాసియాలో ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదం ఉంది. శాంతిని నెలకొల్పాల్సిన అగ్రరాజ్యం, యుద్ధాన్ని ఒక వ్యాపారంగా మార్చుకోవడం ప్రపంచ భద్రతకు పెను ముప్పుగా పరిణమించవచ్చు.