అమెరికా Vs ఇరాన్.. క్షిపణులతోనే కాదు సమాచారం యుద్ధం కూడా..
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అనేక కోణాలు బయటకి వస్తున్నాయి.;
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అనేక కోణాలు బయటకి వస్తున్నాయి. క్షిపణులు, బాంబులతో గర్జిస్తున్న ఈ మూడు దేశాలు యుద్ధానికి సమాంతరంగా సమాచార యుద్ధానికి కొనసాగిస్తున్నాయని అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కు దీటుగా ఇరాన్ తిప్పికొడుతుండటమే విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. యుద్ధంలో తాను చెప్పాలి అనుకున్న విషయాలను ఇరాన్ అగ్రరాజ్యం అమెరికా కన్నా ముందుగా వ్యాప్తి చేస్తోందని, ఇరాన్ వేగంతో అమెరికా, ఇజ్రాయెల్ వెనకబడుతున్నాయని అంటున్నారు. ఇందుకు చూపుతున్న ఉదాహరణలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.
యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచే మూడు దేశాల మధ్య సమాచార యుద్ధం మొదలైందని చెబుతున్నారు. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీని చంపేశామని ప్రధాన లక్ష్యాలన్నింటినీ నాశనం చేశామని, ఈ యుద్ధంలో తాము గెలిచేశామని అధ్యక్షుడు ట్రంప్ నుంచి అమెరికా, ఇజ్రాయెల్ నేతలు, సైనికాధికారులు చెప్పారు. అయితే అమెరికా చెప్పిందాంట్లో సగమే వాస్తవం ఉందని, యుద్ధ రంగంలో తాము విజయానికి దగ్గరగానే ఉన్నామని ఇరాన్ తన సమాచార సాధనాల ద్వారా తెలియజేస్తోందని అంటున్నారు.
యుద్ధంలో అమెరికా కూడా గట్టి ఎదురుదెబ్బలు తింటోందన్న వాస్తవాన్ని ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిందని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా అమెరికాకు చెందిన ఎఫ్/ఏ 18 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన వీడియోను చూపుతున్నారు. యుద్ధ విమానం కూలిన 69 నిమిషాల్లోనే ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఇరాన్ వైరల్ చేసింది. తొలుత ఒక అనామక ఎక్స్ అకౌంటులో ఈ వీడియో ప్రత్యక్షం అవగా, వెనువెంటనే అందిపుచ్చుకున్న ఇరాన్ ప్రభుత్వ సోషల్ మీడియా వర్గాలు తమ టెలిగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
ఆ మరుక్షణమే అన్నిదేశాల్లో ఇరాన్ దౌత్య కార్యాలయాలలు, వాటి సిబ్బంది ఆ పోస్టును షేర్ చేశారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కూడా ఆ వీడియోను ప్రసారం చేసింది. తర్వాత కొద్దిసేపటికే రష్యా, చైనా ప్రభుత్వాలకు చెందిన ఖాతాలు, అధికారిక మీడియాలు దాన్ని వైరల్ చేశాయి. కేవలం పది నిమిషాల వ్యవధిలో ఇవన్నీ జరిగాయని అంటున్నారు. అయితే ఇవన్నీ యాధృచ్చికంగా జరిగింది కాదని, ఇరాన్ ప్రభుత్వం, రష్యా, చైనా సంయుక్తంగా పకడ్బందీగా నిర్వహించిన సమాచార యుద్ధమని విశ్లేషిస్తున్నారు.
ప్రపంచం అంతా అనుకున్నంతలా అమెరికా బలమైన దేశం కాదని, ఆ దేశ యుద్ధ విమానాలను కూల్చగలిగే సత్తా ఇరాన్ కు ఉందని చెప్పడమే ఆ దేశ ఇన్ఫర్మేషన్ వార్ ఉద్దేశమని అంటున్నారు. ఇరాన్ చేసిన ప్రచారంపై అమెరికా వివరణ ఇచ్చుకోడానికి గంటకు పైగా సమయం పట్టిందని, ఆలోగా ప్రపంచం మొత్తం అమెరికా విమానం కూలిపోయిందనే సమాచారం వైరల్ అయిందని అంటున్నారు. యుద్ధానికి సన్నద్ధమవుతున్న దశలోనే ఇరాన్ సమాచార యుద్ధంపై దృష్టి పెట్టిందని తనకు అనుకూలమైన దేశాలు, వర్గాల సాయంతో ఏఐ చాట్ బాట్ లను వాడుకుని తమ వాదనను వినిపిస్తోందని చెబుతున్నారు.