'అది త్యాగం కాదు.. ఆమె హీరో కాదు'.. నెతన్యాహును తగులుకున్న నెటిజన్లు!
సోరోకా ఆస్పత్రిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరాన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.;
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. పైగా గత రెండు మూడు రోజులుగా ఇరాన్ క్షిపణులు.. ఇజ్రాయెల్ లోని జనావాసాలపై దాడులు చేస్తుండటంతో టెల్ అవీవ్ లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో.. తాజాగా బీర్షెబా లోని అతిపెద్ద సోరోకా ఆస్పత్రిని ఇరాన్ క్షిపణులు తాకాయి. ఈ ఘటనలో సుమారు 230 మంది గాయపడినట్లు చెబుతున్నారు.
దీంతో... సోరోకా ఆస్పత్రిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరాన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో... తన కుమారుడి పెళ్లి వాయిదా గురించి ప్రస్థావించిన ఆయన.. దాన్ని కుటుంబ త్యాగంగా అభివర్ణించారు. తన భార్యను ఓ హీరో అంటూ కొనియాడారు. దీంతో.. ఇజ్రాయెలీలు నెట్టింట గట్టిగా తగులుకున్నారు.
అవును... ఇరాన్ తో భీకర యుద్ధం కొనసాగుతోన్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై స్వదేశంలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న ఘటన గురువారం సాక్ష్యాత్కరించింది. తాజాగా సోరోకా ఆస్పత్రిని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ... ఇరాన్ దాడుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు ఆవేదన అనుభవిస్తున్నాయని అన్నారు.
ఇదే సమయంలో... మనలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగిందని.. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోందని తెలిపారు. అక్కడివరకూ బాగానే ఉంది కానీ.. ఆ త్యాగాల్లో తన కుమారుడి వివాహం వాయిదా వేయడాని కూడా చేర్చారు నెతన్యాహు. దీంతో.. విమర్శలు మొదలైపోయాయి. ఈ సందర్భంగా... యుద్ధం కారణంగా తన కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చిందని నెతన్యాహు అన్నారు.
అనంతరం... ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయితో పాటు.. నా భార్య సారాపైనా తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే... ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న సారా ఓ 'హీరో' అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. దీంతో... ఇజ్రాయేలీలు నెట్టింట గట్టిగా తగులుకున్నారు. దీన్ని ఓ త్యాగం అంటారా.. ఆమెను హీరో అంటారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు!
ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ పౌరులు... ఈ యుద్ధ సమయంలో ఎంతోమంది వైద్యులు రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారని.. ఎంతోమంది సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని.. వారు నిజమైన హీరోలని చెబుతుతూ... ఈ ఉద్రిక్తతల కారణంగా తామంతా నరకం అనుభవిస్తుంటే మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అని నెట్టింట నిలదీస్తున్నారు.